వీల్‌ క్లాంప్‌లు మళ్లీ వచ్చాయ్‌.. ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ కుదరదు

Hyderabad Traffic Police to Clamp Down on Illegal Parking - Sakshi

వారంరోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌లు

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): ఏడేళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తే పోలీసులు వాటి చక్రాలకు వీల్‌ క్లాంప్‌లు వేసి జరిమానాలు విధించేవారు. ఈ విధానంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ విధానం నుంచి వైదొలిగారు. తాజాగా వారం రోజులుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. నో పార్కింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల వాహనాలు పార్కింగ్‌ చేస్తే ఆ వాహనాలకు వీల్‌ క్లాంప్‌ వేయడంతో పాటు సదరు వాహనంపై జరిమానా స్టిక్కర్‌ను, ఆ ఏరియాలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారుల నంబర్‌ వేస్తారు. తగిన జరిమానా చెల్లించిన తర్వాత వాహనాన్ని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.  


కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలతో.. 

రోడ్ల పక్కన, షాపుల వద్ద, సినిమా హాళ్ల వద్ద, ఆస్పత్రులు, పార్కులు, నివాసా లు అనే తేడా లేకుండా అక్రమ పార్కింగ్‌లతో ట్రాఫిక్‌ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్‌ పోలీసులు ఎంతసేపూ ద్విచక్ర వాహనదారుల నుంచే పెండింగ్‌ జరిమానాలు వసూలు చేస్తూ కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక నుంచి వీల్‌క్లాంప్‌ వేసిన కార్ల నుంచి కూడా పెండింగ్‌ జరిమానాలు వసూలు చేసేందుకు పోలీసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.  

ఆస్పత్రుల వద్ద ఆందోళన...  
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ ప్రాంతాలు ప్రధాన ఆస్పత్రులకు నెలవుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఆస్పత్రులకు వస్తుంటారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి, అపోలో, సోమాజిగూడ యశోద, బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆస్పత్రికి పెద్ద ఎత్తున రోగులు వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకొని ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియక రోడ్లపక్కన ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కింగ్‌ చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలుపుతున్న వారిని ఈ తరహా జరిమానాలు, క్లాంప్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగుల కోరుతున్నారు. ఎందుకంటే ఏ ఆస్పత్రికి కూడా సరిపడా పార్కింగ్‌ సదుపాయాలు లేవు. (క్లిక్: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌లు)

నిత్యం 15 వరకు కేసులు..  
అక్రమంగా పార్కింగ్‌ చేసిన ప్రాంతాలకు ట్రాఫిక్‌ పోలీసులు వెళ్లి ఆ కార్లకు వీల్‌ క్లాంప్‌లు వేస్తూ ఓ స్టిక్కర్‌ అంటించి దాని మీద సంబంధిత అధికారి ఫోన్‌ నంబర్‌ రాస్తున్నారు. పార్కింగ్‌ చేసిన వాహనదారు ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే ఎస్‌ఐ వెళ్లి వీల్‌ క్లాంప్‌ తొలగించి రూ. 600 జరిమానా విధించి పెండింగ్‌ జరిమానాలు కూడా క్లియర్‌ చేస్తారు. ఒక్కో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోజుకు 15 వరకు కేసులు నమోదు చేస్తున్నాం.  
– జ్ఞానేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ, పంజగుట్ట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top