వైద్యసేవల్లో తెలంగాణ ఫస్ట్‌

Hyderabad: Telangana Has Highest Mbbs Seats To Population Says Harish Rao - Sakshi

సాక్షి, యాదాద్రి: వైద్య సేవల్లో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉంటే.. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌ చిట్టచివరి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పారు. ఒక్క ఏడాదిలో 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. హరీశ్‌రావు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం సైదాపురం గ్రామంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆస్పత్రికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. 

వారి చేతికి పోతే ఆగమే..: రాష్ట్ర ప్రభుత్వం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సిందిపోయి బాధపడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేక, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే ఒకరు కుట్ర అంటున్నారని, అంబేడ్కర్‌ పేరు మీద సచివాలయం నిర్మిస్తే ఇంకొకరు కూలుస్తం అంటున్నారని మండిపడ్డారు. పేల్చేటోని చేతికో.. కూల్చేటోని చేతికోపోతే తెలంగాణ ఆగం అవుతుందన్నారు.

వచ్చే నెల మొదటి వారంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో న్యూట్రిషన్‌ కేసీఆర్‌ కిట్టును ప్రారంభించనున్నామని, ఏప్రిల్‌ మొదటి వారంలో 33 జిల్లాల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటక సర్పంచులు.. తమను తెలంగాణాలో కలపాలని వినతులు ఇస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వార్త వచి్చందని బీబీసీ మీద ఐటీ దాడులు చేయించడాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి, భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top