తెరపైకి మెట్రో నియో, రెండో దశ, బీఆర్‌టీఎస్‌ | Hyderabad Soon to get Neo Metro Second Phase Service, Here What we Know | Sakshi
Sakshi News home page

తెరపైకి మెట్రో నియో, రెండో దశ, బీఆర్‌టీఎస్‌

Sep 28 2022 4:14 PM | Updated on Sep 28 2022 4:31 PM

Hyderabad Soon to get Neo Metro Second Phase Service, Here What we Know - Sakshi

సాక్షి, హైదరాబాద్: జెట్‌ స్పీడ్‌తో విస్తరిస్తోన్న గ్రేటర్‌ సిటీ ప్రజారవాణా వ్యవస్థలో మెట్రో శకం మొదలైంది. ఆధునిక రవాణా సదుపాయాల కల్పన ద్వారానే ట్రా‘ఫికర్‌’ తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెట్రో నియో, రెండోదశ ప్రాజెక్టులతో పాటు కేవలం బస్సులే ప్రత్యేక మార్గంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. వీటిని పట్టాలెక్కించేందుకు నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది.

నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య 75 లక్షలకు చేరువ కావడం, ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం 40 శాతానికి మించకపోవడంతో రహదారులపై నిత్యం ట్రాఫిక్‌ నరకం సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తూ.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు దిక్సూచిగా మారిన పలు ప్రాజెక్టులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 


మెట్రో నియో ఇలా... 

మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ సిస్టం (ఈబీఆర్‌టీఎస్‌) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్‌ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు.

ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్‌ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ–ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌– కోకాపేట్‌ మార్గంలో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం తాజాగా అనుమతించడం గమనార్హం.  

బీఆర్‌టీఎస్‌ సైతం..  
అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే రహదారులను విస్తరించి.. ఈ రహదారికి మధ్యలో కేవలం బస్సులు మాత్రమే రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు లేన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు బస్సులు రావడానికి, మరోవైపు వెళ్లడానికి ఈ మార్గం అనువుగా ఉంటుంది. బీఆర్‌టీఎస్‌ ఏర్పాటుకు కిలోమీటర్‌కు రూ.110 కోట్లు వ్యయం అవుతుంది. శివారు ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ అవసరం ఉండని కారణంగా కిలోమీటరుకు రూ.20 కోట్లు ఖర్చు చేసి బీఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. 

రెండో దశ మార్గం ఇదీ.. 
ప్రస్తుతం ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులో ఉంది. నగరంలో సుమారు 270 కి.మీ మార్గంలో మెట్రో ఏర్పాటు చేయాల్సి ఉందని గతంలో  లీ అసోసియేట్స్‌ నివేదిక స్పష్టంచేసింది. (క్లిక్ చేయండి: నగరంపై ‘కారు’ మబ్బులు!)

ఈ నివేదిక మేరకు మెట్రో రెండోదశ మార్గాలను.. రాయదుర్గం– శంషాబాద్‌ విమానాశ్రయం, ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా, బీహెచ్‌ఈఎల్‌– గచ్చిబౌలి– లక్డీకాపూల్, నాగోల్‌– ఎల్బీనగర్, బీహెచ్‌ఈఎల్‌–పటాన్‌చెరు, జేఎన్‌టీయూ– ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, బీహెచ్‌ఈఎల్‌–పటాన్‌చెరు, ఎల్బీనగర్‌– అబ్దుల్లాపూర్‌మెట్, జేబీఎస్‌– కూకట్‌పల్లి వై జంక్షన్, తార్నాక– కీసర–ఓఆర్‌ఆర్, నానక్‌రాంగూడ– బీహెచ్‌ఈఎల్, బోయిన్‌పల్లి– మేడ్చల్, ఎల్బీనగర్‌–చాంద్రాయణగుట్ట– శంషాబాద్, ఎంజీబీఎస్‌–ఘట్‌కేసర్‌ మార్గాలున్నాయి. ఒక కిలోమీటరు మార్గంలో మెట్రో ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం వ్యయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పబ్లిక్‌– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు సైతం ఏ సంస్థా ముందుకు రాకడంలేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement