శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్‌వీఎస్‌ రెడ్డి

Hyderabad: preconstruction activities of airport metro in full swing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్‌ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారు. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్‌ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) మరియు ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను తెలుసుకోవడం కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతోంది. శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు ఇప్పటిదాకా 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్మెంట్‌ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

చదవండి: (ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాల భర్తీ : కిషన్‌రెడ్డి)

స్టేషన్ స్థానాలను గుర్తించడానికి ఢిల్లీ మెట్రో వారు తయారు చేసిన డీపీఆర్‌ మామూలు రైల్వే ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరించగా, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటలలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన భారీ వాణిజ్య మరియు నివాస అభివృద్ధిని గుర్తించడం ద్వారా ఇప్పుడు ఒక వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన అన్నారు.

నానక్‌రాంగూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల అభివృద్ధికి హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకొని, నగరాన్ని దాని శివార్లలోకి విస్తరించడం, పని ప్రదేశాలకు అరగంట కంటే తక్కువ ప్రయాణ దూరంలో సరసమైన ధరలకు గృహాలను అందించాలనే సీఎం కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ మెట్రోను రూపొందిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. ట్రాఫిక్ సర్వేలో స్థానిక ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్లను జతచేయడం వల్ల స్టేషన్ స్థానాలను సరిగా గుర్తించడంలోను, స్టేషన్ యాక్సెస్ సౌకర్యాలను తక్కువ ఖర్చుతో రూపొందించడంలోనూ మంచి ఫలితాలను ఇస్తోందని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top