మత్తుకు మందేసే ‘డాక్టర్‌ పోలీస్‌’ | Sakshi
Sakshi News home page

మత్తుకు మందేసే ‘డాక్టర్‌ పోలీస్‌’

Published Sat, May 7 2022 2:43 AM

Hyderabad: Police to Provide Rehab Services to Drug Addicts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏదో సరదాగానో, స్నేహితులతో కలిసో డ్రగ్స్‌కు అలవాటవుతున్నారు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తున్నారు. బయటికొచ్చాక అలవాటు మానుకోలేక మళ్లీ డ్రగ్స్‌ వైపు చూస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌పెట్టే దిశగా పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తామే బాధితులకు తగిన చికిత్స ఇప్పించడం, కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా డ్రగ్స్‌ నుంచి దూరం చేసేలా ‘రీ–హ్యాబ్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలతో పాటు నాలుగు ప్రైవేట్‌ సంస్థలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రీ–హ్యాబ్‌ విధివిధానాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మీడియాకు వివరించారు. ఆ వివరాలివీ..

– ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగర పోలీసులు డ్రగ్స్‌ కేసుల్లో మొత్తం 372 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 40 మంది బయటి ప్రాంతాల వారితో సహా 193 మంది పెడ్లర్స్‌ ఉన్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తూ విక్రయిస్తున్న 85 మంది, వినియోగదారులు 94 మందినీ కటకటాల్లోకి పంపారు.

– వీళ్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఐదు సంస్థల సహకారంతో వారిపై నిఘా ఉంచనున్నారు. తల్లిదండ్రుల సమ్మతితో వారిని స్క్రీనింగ్‌ చేస్తారు. అవసరమైన వారికి ఇన్‌షేషెంట్స్‌గా.. మిగిలిన వారికి ఔట్‌ పేషెంట్స్‌గా చికిత్స అందించనున్నారు. రెండు నెలల పాటు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఉంటుంది.

– మొదటి నెల వారానికి రెండు సార్లు, రెండో నెల వారానికి ఒకసారి చొప్పున కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఈ కాలంలో వారి సమ్మతితోనే ప్రతి వారం మూత్రం, రక్త పరీక్షలు చేసి ఇంకా డ్రగ్స్‌ వాడుతున్నారా? లేదా? అనేది గుర్తిస్తారు. ఇన్‌పేషెంట్స్‌కు కనిష్టంగా 28 రోజుల చికిత్స ఉంటుంది. 

– ప్రైవేట్‌ సంస్థల్లో ఒక్కో సెషన్‌కు రూ.2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్తోమత లేని వారికి ఎర్రగడ్డ వైద్యశాలలో రీ–హ్యాబ్‌ ప్రక్రియ పూర్తి చేయిస్తారు. ఆయా సంస్థల్లోని నిపుణులు వివిధ దశల్లో కౌన్సెలింగ్, వైద్యం చేసి వారు డ్రగ్స్‌కు దూరమయ్యేలా చేస్తారు. ఇది శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. 

– మాజీ డ్రగ్స్‌ వినియోగదారులపై ఆయా సంస్థల సహకారంతో పోలీసులు నిఘా కొనసాగిస్తారు. మద్యం అలవాటు నుంచి బయటపడిన వారి (ఆల్కహాల్‌ అనానిమస్‌) గ్రూపుల మాదిరిగానే భవిష్యత్తులో నార్కోటిక్‌ అనానిమస్‌ గ్రూపులు ఏర్పాటు చేసి, వారంతట వారే తమపై నిఘా ఉంచుకునేలా, ఒకరికొకరు సహకరించుకునేలా నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement