హైదరాబాద్‌: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. | Sakshi
Sakshi News home page

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు..

Published Fri, Apr 22 2022 7:53 AM

Hyderabad Metro Launches Electric Auto Service At 2 Stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్‌ నుంచి ఇంటికి చేరుకునేందుకు మెట్రో రైడ్‌ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి. గురువారం పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌ పార్కింగ్‌లో హెచ్‌ఎం ఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సీఈవో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రోరైడ్‌ కో–ఫౌండర్‌ గిరిష్‌ నాగ్‌పాల్, షెల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి తహసీన్‌ ఆలమ్, డబ్ల్యూ ఆర్‌ ఐ ఇండియా డైరెక్టర్‌ పవన్‌ ములుకుట్లలతో కలిసి ఈ– ఆటోలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్‌ చేరుకోవాలంటే ప్రైవేటు ఆటోల కంటే మెట్రో ఆటోల్లో చార్జీలు తక్కువ అని అన్నారు. మొదటి కిలోమీటర్‌కు పది రూపాయలు తర్వాత ప్రతి కిలో మీటరుకు ఆరు రూపాయల చొప్పున చార్జీలు ఉంటాయని చెప్పారు. ఆటోను బుక్‌ చేసుకునేందుకు మెట్రోరైడ్‌ ఇండియా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 50 ఎలక్ట్రికల్‌ ఆటలతో ప్రారంభిస్తున్నామని, దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తామని చెప్పారు. మెట్రో సంస్థపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని, ఫేజ్‌– 2లో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైలు సేవలను రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.  

Advertisement
Advertisement