క్యాంపులు నిర్వహించొద్దు

Hyderabad Mayor and Deputy to be elected on February 11 - Sakshi

విప్‌లు ధిక్కరించాలని ఒత్తిడి, ప్రలోభాలు తేవొద్దు

జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌

ఎన్నికలపై ఎస్‌ఈసీ ప్రత్యేక నియమావళి జారీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. లంచం లేదా ప్రలోభాలకు గురిచేయొద్దని, రాజకీయ పార్టీలు, మేయర్‌ / డిప్యూటీ మేయర్‌ వంటి పదవులను ఆశిస్తున్న వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమపద్ధతులు పాటించడం, ప్రోత్సహించడం చేయొద్దని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ చట్టం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహణ ప్రారంభసమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ నిషేధం ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఎస్‌ఈసీ జారీ చేసింది.
 
ప్రభావితం చేయొద్దు..: రాజకీయపార్టీలు జారీ చేసిన విప్‌లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయవద్దని ఎస్‌ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనాగానీ పరోక్ష ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటుహక్కులను వినియోగించే సందర్భంలో వారిని ప్రలోభపరచడానికి ప్రయత్నించొద్దని తెలిపింది. ఏదైనా రాజకీయపార్టీ, మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు పోటీ పడుతున్నవారు ఓటర్లు, వారి ఓటింగ్‌ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్‌ను ధిక్కరించేందుకుగాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపొద్దని పేర్కొంది. అధికార పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసె న్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్‌   కేసులను ఎత్తివేయడం, పెండింగ్‌ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టుల పునరుద్ధరణ, ఇతర ప్రోత్సాహకాలు, ఇతర పద్ధతుల్లో దుర్వినియోగానికి ప్రయత్నిం చొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులపై విచారణ సం స్థల ద్వారా కేసుల నమోదు లేదా చార్జి షీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు వంటి వాటి అమలులో పక్షపాతానికి పాల్పడవద్దని పేర్కొంది.   
     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top