9 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్! | Hyderabad Cyber ​​Crime Police Conducts Massive Operation In 9 States, 35 Interstate Fraudsters Arrested, ₹88.48 Lakh Recovered | Sakshi
Sakshi News home page

9 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్!

Oct 10 2026 1:19 PM | Updated on Oct 10 2026 1:34 PM

Hyderabad Cyber ​​Crime Police conducts massive operation in 9 states

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు 2026 సెప్టెంబర్‌లో నమోదైన పలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) ఫిర్యాదులపై స్పందించి మొత్తం 83 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 23 కేసులకు సంబంధించి 35 మంది అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో తెలంగాణ నుంచి 10, ఏపీ నుంచి 9, మహారాష్ట్ర నుంచి 6, కేరళ, యూపీల నుంచి ముగ్గురు చొప్పున ఉండగా, బిహార్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో నిలిపివేసిన మొత్తం రూ. 88,48,134 రూపాయలను బాధితులకు అందించారు.

నిందితుల నేరాల స్వభావాన్ని పరిశీలిస్తే.. సోషల్ మీడియా నేరాల్లో 9 మంది, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో 7, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో 6, ట్రేడింగ్ మోసాల్లో 5 మందితో పాటు ప్రకటనలు, గుర్తింపు చౌర్యం, జాబ్ ఫ్రాడ్ తదితర మోసాలకు పాల్పడిన వారు ఉన్నారు. ఈ  నెలలో మొత్తం 38 మోసపూరిత కేసుల్లో బాధితులు ₹17.34 కోట్ల మేర నష్టపోగా, పోలీసులు రూ. 88.48 లక్షలను వెనక్కి ఇప్పించారు. మరోవైపు జోనల్ సైబర్ సెల్స్ పరిధిలో 381 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ. 67.54 లక్షలను బాధితులకు రీఫండ్ చేయించారు. ప్రధానంగా మధురానగర్‌కు చెందిన ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ. 6.60 లక్షలు కాజేసిన పూణే నిందితుడు శుభమ్ మోహన్ లొండేను పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ పెట్రోల్ విభాగం డిజిటల్ నిఘా ద్వారా మైనర్లను అసభ్యకరంగా చూపుతూ మానిటైజేషన్ పొందుతున్న 140 సోషల్ మీడియా ఖాతాలను, పాత నాణాలు, బెట్టింగ్ పేరిట నడుస్తున్న పేజీలను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకుంది. అలాగే ఆన్‌లైన్ గేమింగ్, అక్రమ బెట్టింగ్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ సైట్లను ప్రచారం చేస్తున్న 1,457 ప్రొఫైల్స్, 2,603 పెయిడ్ ప్రకటనలను నిలిపివేసి 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గణేష్ నిమజ్జనం వేళ సోషల్ మీడియాలో న్యూసెన్స్ సృష్టించిన వారిపై 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అటు 'సి-మిత్ర' విభాగం ద్వారా 1,928 కాల్స్ చేసి బాధితులకు అండగా నిలవడమే కాకుండా 307 జీరో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ, I4C ఆధ్వర్యంలోని 'మనీ రిస్టోరేషన్ మోడ్యూల్' (MRM), 'గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం' (GRM) పోర్టళ్ల ద్వారా నిధుల రికవరీ, ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నగర అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్‌) ఎమ్ శ్రీనివాసులు, ఐపీఎస్ ప్రజలకు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట వచ్చే నకిలీ సందేశాలు, అధిక లాభాలు ఆశజూపే టెలిగ్రామ్/వాట్సాప్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపులు, అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు, హనీ ట్రాప్/సెక్స్‌టార్షన్ వలల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనే విధానమే లేదని, సీబీఐ, ఈడీ, పోలీసు, నార్కోటిక్స్ లేదా ఫెడెక్స్ పేరిట వచ్చే బెదిరింపు వీడియో కాల్స్‌ను నమ్మి భయపడవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement