
ప్యాసెంజర్లను సురక్షితంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సిన అతడు ఫోన్‌లో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒకట్రెండు నిమిషాలు కాదు.. చాలా సేపు.
హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మొబైల్‌లో గేమ్స్‌కు అడిక్ట్ అయిన ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ప్యాసెంజర్లను సురక్షితంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సిన అతడు ఫోన్‌లో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒకట్రెండు నిమిషాలు కాదు.. చాలా సేపు.
వెనకాల కూర్చున్న ప్యాసెంజర్ గేమ్ ఆడకుండా డ్రైవింగ్ చేయమని చెప్పినా అతడు పట్టించుకోలేదు. అలాగే నిర్లక్ష‍్యంగా కారును ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లాడు. కనీసం సీట్ బెల్టు ధరించమని చెప్పినా పట్టించుకోలేదు. డ్రైవర్ వెర్రి చర్యకు చిర్రెత్తిపోయిన ప్యాసెంజర్ రాజీవ్ సింగ్ ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు.
@CYBTRAFFIC driving while playing pic.twitter.com/RRUP7GXF2E
— Rajiv Singh (@rajusingh0810) August 5, 2022
ఇతని పేరు రాజు. అరుదైన డ్రైవింగ్ స్టైల్ ఉన్నట్టుంది. ఫోన్లో గేమ్ ఆడుతూనే కారు నడపుతున్నాడు. అసలు ఇతడ్ని డెల్ సంస్థ క్యాబ్ డ్రైవర్‌గా ఎలా తీసుకుంది అని వాపోయాడు. రాజీవ్ షేర్ చేసిన వీడియో చూసి నగర పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ చోటు ఎక్కడని అడిగారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అని అతడు బదులిచ్చాడు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలుసుకుని పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.
చదవండి: ‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు