గూగుల్‌కు బాంబ్‌ బెదిరింపు.. తమ్ముడికి ట్విస్ట్‌ ఇచ్చిన అన్న.. అసలు విషయం తెలియడంతో షాక్‌!

Hyd Man Arrested For Warning To Brother Bomb Threat Google Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి గొడవలు గూగుల్‌కు ‘అంటుకున్నాయి’. ఆ సంస్థలో పని చేస్తున్న అన్నకు తమ్ముడు ఇచ్చిన వార్నింగ్‌ బాంబు బెదిరింపుగా మారింది. పుణేలోని గూగుల్‌ కార్యాలయానికి బాంబు బెదిరింపు అంటూ కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సోమవారం చందానగర్‌లో శివానంద్‌ అనే యువకుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మొత్తం అన్నదమ్ముల ఆస్తి పంచాయితీగా తేలింది.

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిత్రపురికాలనీకి చెందిన దయానంద్, శివానంద్‌ అన్నదమ్ములు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్న వీరి మధ్య కొన్నాళ్లుగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. నగరంలో ఉన్న ఓ ఇంటిని విక్రయించే విషయంలో ఇవి మరింత ముదిరాయి. ప్రస్తుతం దయానంద్‌ పుణేలోని గూగుల్‌ క్యాంపస్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం తన అన్నకు ఫోన్‌ చేసిన శివానంద్‌ ఇంటిని అమ్మే విషయంపై వాగ్వాదానికి దిగాడు. ఇది తారాస్థాయికి చేరడంతో తన మాట వినకపోతే బాంబుతో పేల్చేస్తానని అన్నాడు.

అప్పటికే సోదరుడిపై కక్షతో ఉండి, దీంతో సహనం కోల్పోయిన దయానంద్‌ ఈ వార్నింగ్‌కుఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. తమ్ముడిని ఇబ్బంది పెట్టాలని పథకం వేసి ముంబైలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని గూగుల్‌ క్యాంపస్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేశాడు. రాత్రి 7.54 గంటల సమయంలో తనకు ఫోన్‌ చేసిన ఆగంతకుడు పుణే క్యాంపస్‌లో బాంబు పెట్టినట్లు, దాన్ని పేల్చేయనున్నట్లు బెదిరించాడని చెప్పాడు. ఆగంతకుడికి చెందినదిగా చెప్తూ తన సోదరుడి ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు.

ఈ పరిణామంతో ఆందోళనకు గురైన మేనేజర్‌ ఈ విషయాన్ని ముంబై జోన్‌–5 డీసీపీ విక్రమ్‌ దేశ్‌ముఖ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ప్రాథమిక, సాంకేతిక ఆధారాలను బట్టి ఆగంతకుడు సైబరాబాద్‌ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం సోమవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది.

ఆ సమయంలో శివానంద్‌ చందానగర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉన్నాడు. స్థానిక పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్లిన ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేసి ముంబై తరలించారు. శివానంద్‌ను విచారించిన నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దయానంద్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గూగుల్‌ ముంబై క్యాంపస్‌ నుంచి సమాచారం కోరారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top