Hyderabad: రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరు | Sakshi
Sakshi News home page

Hyderabad: రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరు

Published Sun, Oct 30 2022 2:42 PM

HYD: Illegal Constructions At State Financial Corporation Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ)కి కేటాయించిన స్థలాన్ని అక్రమార్కులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. ఇక్కడి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. సర్వే నంబర్ల మాయాజాలంతో కొండలను పిండి ప్లాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువచేసే 50 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు కట్టారు.. ఇదేమని ప్రశ్నించేవారే లేకపోవడంతో కబ్జాదారుల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకవైపు రెవెన్యూ.. మరోవైపు ఎస్‌ఎఫ్‌సీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

2007లో ఎస్‌ఎఫ్‌సీకి కేటాయింపు.. 
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్వేనంబర్‌ 307లోని 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సుమారు 249 ఎకరాలకుపైగా స్థలాన్ని 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎస్‌ఎఫ్‌సీకి స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు ఆ స్థలానికి ఎటువంటి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. దీంతో పక్కనే ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా పెద్ద పెద్ద కొండలను కరిగించి ప్లాట్లు చేస్తూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ వచ్చారు.  

ఇలా ఏకంగా 50 ఎకరాలకు పైగానే అన్యాక్రాంతమైందని రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఆ స్థలాలను కా పాడే రెవెన్యూ అధికారులు, ఎస్‌ఎఫ్‌సీ సిబ్బంది కబ్జాదారులకు వత్తాసుగా నిలవడంతో ఆ స్థలం మొత్తం అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నా యని పలువురు అధికారుల తీరుపై అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ స్థలం విషయంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా ఢిల్లీలో జరిగిన విభజన హామీ విషయంలో మొదటి ప్రాధాన్యం ఈ స్థలంపైనే ఉండడం విశేషం. 

ప్రైవేటు స్థలమంటూ..  
∙సర్వే నంబర్‌ 307 ప్రభుత్వ స్థలంలో చుట్టూ సర్వే చేసిన మ్యాప్‌ను కబ్జాదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సర్వే నంబర్‌ 325, 326ల పక్కనే ఓ కొండ ఉండేది. ఇప్పుడు అది కనిపించకుండా పోయింది. దీని వెనక సూత్రధారులు.. పాత్రధారులు ఎవరనే విషయం అంతు చిక్కకుండా మారింది. ప్రభుత్వ సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న ఈ కొండ మాయం కావడం వెను క ఓ మండల రెవెన్యూ ‘సర్వే’  అధికారి అన్నీ తా నే చూసుకోగా కబ్జాదారులు తమ పని పూర్తి చేశా రు. ఏకంగా సుమారు 30 ఎకరాలపై గాని కలుపుకొని ప్లాటింగ్‌ చేసి ఎటువంటి అనుమతులు లేకుండా గదులు నిర్మించి ఖాళీగా వదిలేశారు.  

ఎక్కడైనా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయాల్సిన బాధ్యత రెవిన్యూ, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్, ఎస్‌ఎఫ్‌సీ అధికారుల బాధ్యత. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఎస్‌ఎఫ్‌సీ భూములు రోజురోజుకూ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి.  అధికారులు మేల్కొనకపోతే మిగిలిన స్థలం సైతం ప్రైవేట్‌ సర్వే నంబర్లతో ప్లాట్లు చేసి అక్రమార్కులు విక్రయించే ప్రమాదం పొంచి ఉంది.   

ఎవరినీ వదిలిపెట్టం..  
ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్‌ ఫోర్స్‌ ఎక్కువగా కావాలి. ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. తప్పకుండా వారం పది రోజుల్లో ఎస్‌ఎఫ్‌సీ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తాం. ఇప్పటికే పలువురుపై ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తాం. ఇక్కడ జరుగుతున్న అనుమతుల వెనక ఎవరు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమార్కులపైపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
- సంజీవరావు, కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ 

Advertisement
 
Advertisement