Hyderabad: డీఏవీ స్కూల్‌ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? 

HYD Education Officials Getting Confuse On DAV School Recognition Cancel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: డీఏవీ స్కూల్‌ గుర్తింపు రద్దుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు  తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు.

వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాల నుంచి మద్దతు పెరిగింది. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా గుర్తింపు రద్దు అంశంపై విద్యాశాఖ అధికారులతో  భేటీకి సిద్ధమైంది. జరిగిన ఘటన సహించరానిదైనప్పటికీ పాఠశాల గుర్తింపు రద్దు సమంజసం కాదని విద్యావేత్తలు సైతం పేర్కొంటున్నారు. దీంతో విద్యాశా«ఖ పాఠశాలకు ఎన్‌ఓసీ విత్‌డ్రాపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.   

పాఠశాలను తెరిపించాల్సిందే..  
డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ గుర్తింపు రద్దును వెనక్కు తీసుకొని స్కూల్‌ను తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్‌ పెరిగింది. అవసరమైతే ప్రభుత్వం స్కూల్‌ను స్వాధీనం చేసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, కమిటీని ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పించి స్కూల్‌ కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చి ఆప్షన్ల ప్రకారం మరో పాఠశాలలో చేరడం తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు.

ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారంతో పాటు దూరాభారం కూడా అవుతుందని వారంటున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ ద్వారా అభిప్రాయాలు  బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ను కొనసాగించాలంటూ సఫీల్‌గూడలోని డీఏవీ స్కూల్‌లో ఓ బ్యాలెట్‌ బాక్సు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ కొనసాగాలని అభిప్రాయాలతో ఈ బ్యాలెట్‌ బాక్సులో వేస్తున్నారు. 

ఢిల్లీ నుంచి స్కూల్‌ యాజమాన్యం 
రెండు రోజుల్లో న్యూఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం అధికారులు హైదరాబాద్‌కు రానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. విద్యాశాఖ అధికారులతో సైతం సమావేశమై వినతి పత్రం సమరి్పంచనుంది. విద్యాశాఖ  మంత్రి, కమిషనర్లను బుధవారం తల్లిదండ్రులు కలిసి డీఏవీ స్కూల్‌ ఇక్కడే కొనసాగించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. 

మూసివేత వద్దు 
పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని  విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీల కార్యదర్శులు కె.అశోక్‌రెడ్డి, కె.నాగలక్ష్మి, జావిద్‌లు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని యథావిధిగా నడపాలని కోరారు.


మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top