‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘ | Woman Murdered By Husband After Repeatedly Urging Him To Give Up Alcohol In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘

Jul 4 2026 9:58 AM | Updated on Jul 4 2026 10:24 AM

Husband-Wife Incident in Hyderabad

హైదరాబాద్‌: తాగుడు మానుకోవాలని కోరిన భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన కిలారు బాలకృష్ణ, భార్గవి దంపతులు బాచుపల్లి రాజీవ్‌ గాం«దీనగర్‌లో ఉంటున్నారు.  వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ మద్యానికి బానిసయ్యాడు. భార్య..మద్యం మానుకోవాలని పలుసార్లు చెప్పింది.  అయితే భార్య మాటలను అవమానంగా భావించిన బాలకృష్ణ..  కొన్ని నెలలుగా శారీరకంగా,  మానసికంగా వేధిస్తున్నాడు. 

పిల్లలకు సెలవులు రావడంతో భార్గవి పుట్టింటికి వెళ్లగా.. ఏప్రిల్‌ 25న బాలకృష్ణ తన సోదరుడితో కలిసి మద్యం మత్తులో అక్కడికి చేరుకుని భార్యతో పాటు అత్తను దుర్భాషలాడాడు.  భార్గవి సోదరుడిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భార్గవి భర్త ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది.అత్తమామలు వచ్చి సర్దిచెప్పడంతో  జూన్‌ 13న  భర్త వద్దకు వెళ్లింది.  మొదటి రోజే బాలకృష్ణ భార్యపై బెల్టుతో దాడి చేశాడు.  జూన్‌ 20న ఉదయం నుంచే మద్యంతాగి భార్యపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ ఇంటి బయటే అవమానించాడు.  

అదేరోజు బయటకు వెళ్లే ముందు ‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘ అని బెదిరించిన బాలకృష్ణ, రాత్రి తిరిగి వచ్చి భార్గవిని గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. పిల్లలకు కూడా తల్లి ఉరేసుకుందని చెప్పి, అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద పరిస్థితులు గమనించి కేసు నమోదు చేశారు. విచారణలో బాలకృష్ణ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హత్య చేసిన విషయాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement