‘ఈజీ’ ఐపాస్‌.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు! | Sakshi
Sakshi News home page

‘ఈజీ’ ఐపాస్‌.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!

Published Fri, May 24 2024 6:14 AM

Huge changes to TG iPass

టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!

కొత్త పారిశ్రామిక పాలసీపై సర్కారు దృష్టి 

రాయితీలు, ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే చాన్స్‌ 

గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదంటున్న కొత్త సర్కారు 

పరిశ్రమలకు రూ.3,736 కోట్ల బకాయిలు!

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న విధానాల కంటే మెరుగైన విధానాలను అమలు చేయాలని యోచిస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్‌ ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం రూపొందించిన టీజీ ఐపాస్‌ (గతంలో టీఎస్‌ ఐపాస్‌) చట్టంలో సమూల మార్పులు చేస్తూ కొత్త పారిశ్రామిక విధానం ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు.  

రెండు పథకాలు అమలు చేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ 
నూతన పాలసీలో ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని అంటున్నారు. వాస్తవానికి పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడులతో వచ్చే వారికి సత్వర అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం టీజీ ఐపాస్‌ను అమలు చేసింది. మరోవైపు పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రెండు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేసింది. 

టీ ఐడియా (జనరల్‌ కేటగిరీ), టీ ప్రైడ్‌ (ఎస్సీ, ఎస్టీ) స్కీమ్‌ల కింద పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ, సేల్స్‌ టాక్స్‌ తదితరాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పింది. అయితే గత ప్రభుత్వంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని, నూతన పారిశ్రామిక విధానంలో తాము వీటికి పెద్దపీట వేస్తామన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. 

పేరుకు పోయిన బకాయిలు 
కొత్త ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టడంతో బకాయిలు పేరుకుపోయాయి. చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు దాదాపు రూ.3,736.67 కోట్లు. 

వీటిలో రూ.3,007 కోట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఇచి్చన రూ.684 కోట్ల విలువైన చెక్కులు చెల్లలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు చెల్లించేలా కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement