
భగ్గున మండుతున్న ఎండలు
గ్రేటర్‌లో భారీగా బీర్ల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: అసలే ఎండలు.. ఆపై వేసవి తాపం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న మద్యంప్రియులు బీర్లతో చిల్ అవుతున్నారు. పెద్దఎత్తున బీర్లు సేవిస్తున్నారు. దీంతో రెండు నెలలుగా బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి బీర్ల అమ్మకాలు రెట్టింపైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి లిక్కర్‌ను సేవించే వాళ్లు సైతం ‘చిల్’అయ్యేందుకు చల్లటి బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వైన్‌షాపులు సహా మార్టుల్లో చల్లని బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో చల్లటి బీర్ల కొరత ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు పది నుంచి పదిహేను కాటన్ల బీర్లను మాత్రమే రిఫ్రిజిరేటర్లలో బీర్లను పెట్టేవారు. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో రోజుకు 30 నుంచి 40 కేసుల బీర్లను రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయాల్సి వస్తోంది. అయినా చిల్డ్ బీరు దొరకడం కష్టమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్‌లో లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.3,272.32 కోట్ల ఆదాయం సమకూరగా, కేవలం గ్రేటర్ జిల్లాల నుంచే రూ.1160 కోట్లకుపైగా ఆదాయం సమకూరడం గమనార్హం.