శభాష్‌ పోలీస్‌..

Home Guard Rescued Passenger At Nampally Railway Station In Hyderabad - Sakshi

సాక్షి, నాంపల్లి: కదులుతున్న రైలు నుంచి దిగుతూ కిందపడిన ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్లాట్‌ఫారం-రైలుకు మధ్యన  ఇరుక్కుపోయే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు శ్రవణ్‌ చాకచక్యంగా ప్రమాదపు అంచుల్లో  ఉన్న ప్రయాణికుడిని కాపాడాడు. ఈ సంఘటన నాంపల్లి ఆర్పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుడిని హోంగార్డు కాపాడుతున్న సీపీ పుటేజి (దృశ్యాలు) పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వివరాల్లోకి వెళితే... నగరంలో నివాసం ఉంటున్న ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ బంధువు రాహుల్‌(23) హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి నగరానికి బయలుదేరాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో రైలు బేగంపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

సెకండ్‌ ఏసీలో ప్రయాణిస్తున్న రాహుల్‌ (దిగాల్సిన స్టేషన్‌లో) దిగకుండా రైలు ఆగి కదిలే సమయంలో దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్‌ఫారం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో కింద పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాంపల్లి ఆర్పీఎఫ్‌ హోంగార్డు శ్రవణ్‌ అప్రమత్తమై  రాహుల్‌ను ఒక్కసారి పట్టుకుని పక్కకు లాగడంతో అతను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు కాపాడిన హోంగార్డు శ్రవణ్‌కు  రాహుల్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రయాణికుడిని కాపాడిన హోంగార్డు శ్రవణ్‌ను జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ చౌదరి అభినందించారు. విధుల పట్ల, ప్రయాణికుల పట్ల అతడికి ఉన్న బాధ్యతను మెచ్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top