
ఆన్‌లైన్‌లోనే ల్యాండ్‌యూజ్ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు
గతంలో భూ వినియోగ పత్రాలపై భారీగా అక్రమాలు
చెరువుల్లోని భూములకు సైతం నివాస వినియోగం
ఇక నిబంధనలకు అనుగుణంగా ల్యాండ్ యూజ్ పత్రాలు
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఇక ఈజీగా భూ వినియోగ ధ్రువీకరణ పత్రాలు లభించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అందజేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో ల్యాండ్‌యూజ్ సర్టిఫికెట్‌ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. చెరువులు, పార్కులు, వ్యవసాయ, అటవీ భూములను సైతం కొన్నిచోట్ల నివాసయోగ్యమైనవిగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌లను జారీ చేశారు. మూడేళ్ల క్రితం వరకు నగరం చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ల్యాండ్‌యూజ్ సర్టిఫికెట్‌లు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిజాయతీగా, అన్ని విధాలా అర్హత ఉన్న భూములకు సైతం సకాలంలో ల్యాండ్‌యూజ్ సర్టిఫికెట్‌లు లభించకపోవడంతో చాలామంది తీవ్రంగా నష్టపోయారు. తీవ్రమైన జాప్యం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు.
అక్రమాలను నివారించేందుకు..
రియల్ ఎస్టేట్ భూమ్ బలంగా ఉండి అనేక చోట్ల భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆకాశహర్మ్యాలు వెలిశాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో భూ వినియోగ ధ్రువీకరణ పెద్ద వ్యాపారంగా కొనసాగింది. ఇలాంటి అక్రమాలను నివారించి పారదర్శకంగా అందజేసేందుకు హెచ్‌ఎండీఏ (HMDA) అధికారులు కసరత్తు చేపట్టారు. దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించి పత్రాలను పొందవచ్చు. ‘ఆన్‌లైన్‌లో అందజేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తుదారులకు సకాలంలో సర్టిఫికెట్‌లు లభిస్తాయి’ అని హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఇందుకనుగుణంగా త్వరలో కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ట్రిపుల్ ఆర్ వరకు మ్యాపింగ్...
హెచ్‌ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ (RRR) వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో 7 జిల్లాల్లో 7250 చ.కి.మీ ఉన్న హెచ్‌ఎండీఏ కొత్తగా 10,472 చ.కి.మీ. వరకు పెరిగింది. 11 జిల్లాలకు విస్తరించి ఉంది. దీంతో ట్రిపుల్ ఆర్ వరకు కొత్తగా హెచ్‌ఎండీఏలో విలీనమైన 1,355 గ్రామాల్లోని భూములను సైతం జియో మ్యాపింగ్ చేయనున్నారు. ఈ దిశగా ఇప్పటికే మెగా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల భూముల వాస్తవ స్థితిగతులు మారాయి. కొన్నిచోట్ల అనేక రకాలుగా ఆక్రమణకు గురయ్యాయి. నిర్దిష్టంగా ఏ భూమి ఏ రకమైన వినియోగంలో ఉందనే విషయంలో స్పష్టత కొరవడింది.
చదవండి: ఈవీలకు వైర్‌లెస్ చార్జింగ్
ఈ క్రమంలో అన్ని ప్రాంతాల్లో భూములను జియో మ్యాపింగ్ చేస్తారు. తద్వారా దరఖాస్తుదారులు కోరిన విధంగా ల్యాండ్‌యూజ్ సర్టిఫికెట్‌లను అందజేసేందుకు అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే అవకాశం ఉన్న చోట వ్యవసాయ భూములను నివాస యోగ్యమైనవిగా మార్చుకొనేందుకు కూడా వెసులుబాటు లభించనుంది. ‘శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో మెగా మాస్టర్‌ప్లాన్ అతికీలకమైన మైలురాయి కానుంది. 2050 వరకు హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను ఇందులో రూపొందిస్తున్నామని హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఈ మాస్టర్‌ప్లాన్ ఆధారంగానే దరఖాస్తుదారులు కోరినవిధంగా సేవలను సులభంగా అందజేయవచ్చని పేర్కొన్నారు.
లే అవుట్‌లు, నిర్మాణాల్లో కీలకం..
భూ వినియోగ ధ్రువీకరణ పత్రాలతో పాటు లేఅవుట్‌లు, భవన నిర్మాణాల్లో సైతం వివిధ రకాల భూముల మ్యాపింగ్ కీలకం కానుంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సమగ్రమైన మ్యాపులు అందుబాటులో లేకపోవడంతో అధికారులు రకరకాల మ్యాపులను పరిశీలించాల్సి వస్తోంది. ఈ కారణంగా కొత్తగా చేరిన ప్రాంతాల్లో లేఅవుట్ అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. వివిధ కేటగిరీలుగా భూములను మ్యాపింగ్ చేసిన అనంతరం కొత్తగా చేరిన ప్రాంతాల్లో కూడా లే అవుట్ ప్రొసీడింగ్‌లు సులభతరం కానున్నాయి. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల మ్యాపింగ్‌పై రెండు రోజుల క్రితం అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి చేసి అనుమతులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.