
హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులు మరింత సులభతరం
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 75 నుంచి 240 చదరపు గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్లు, స్టిల్ట్+2, జీ+1 అంతస్తుల భవనాల అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే అనుమతులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం భవన యజమానులు నేరుగా అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్టిఫికెట్లను పరిశీలించి అనుమతులనిస్తారు. నాలుగు దశల్లో ఇది పూర్తవుతుంది.
భవన నిర్మాణదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సమర్పించిన సమాచారం సరైందేనని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. మూడో దశలో ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజు చెల్లించాలి. నాలుగో దశలో భవన యజమానులు అనుమతి పత్రాలను ఆన్‌లైన్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌బీపాస్ అనుమతుల్లో సందేహాలపై టోల్‌ఫ్రీ నంబర్ 1800–5992266ను సంప్రదించవచ్చు. 040–22666666కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సప్ ద్వారా సమాచారం కోసం ఫోన్: 9392215407ను సంప్రదించవచ్చు. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్‌లోనే ఎక్కువ.. ఎందుకంటే!)