High Court Serious On Telangana State Over New Year Celebrations - Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Published Thu, Dec 31 2020 2:01 PM

High Court Serious On State Govt On New Year Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్‌ చేయడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులకు, బార్‌లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది.  పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కొత్త వైరస్‌ మోర్ డేంజర్‌ అంటుంటే.. న్యూ ఇయర్‌ వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కొత్త రకం కరోనా వైరస్‌ నేపథ్యంలో రాజస్తాన్‌, మహారాష్ట్రలో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారని, తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. కరోనా దృష్ట్యా వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామన్నారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం.. డిసెంబర్‌ 31న పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించేలా చూడాలని ఆదేశించింది. (న్యూ ఇయర్:‌ మందుబాబులకు గుడ్‌న్యూస్‌)

న్యూ ఇయర్ వేడుకలపై పూర్తి నివేదిక జనవరి 7న సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే బార్లు, క్లబ్‌లకు అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనతో మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 

తెలంగాణలో ప్రస్తుతం సెకండ్ వేవ్ లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మొదటి వేవ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కరోనా నేపథ్యంలో జనవరి 31 వరకు కేంద్ర నిబంధనలు రాష్ట్రంలోనూ అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర నిబంధనలతో ఎగ్జిబిషన్ వాయిదా వేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement