'పెండింగ్‌’కు ‘మధ్యవర్తిత్వం’ చక్కటి పరిష్కారం

High Court Judges should encourage mediation - Sakshi

భరించలేని భారమైతే వ్యవస్థ దెబ్బతింటుంది

హైకోర్టు జడ్జిలు..మీడియేషన్‌ను ప్రోత్సహించాలి 

‘మధ్యవర్తిత్వం’పై చర్చలో హైకోర్టు సీజే 

సాక్షి, హైదరాబాద్‌: భరించలేనంత భారం మోపితే ఏ వ్యవస్థ అయినా దెబ్బతింటుందని.. ఆ ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరం అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం అమలు విధానంపై చర్చా కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, రాష్ట్ర లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ నవీన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమం మూడు రోజులు జరగనుంది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ.. ‘ ఏటికేడు పెరిగిపోతున్న పెండింగ్‌ కేసులతో న్యాయవ్యవస్థపై విపరీత భారం పడుతోంది. న్యాయమూర్తులపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీనికి చక్కని పరిష్కారమే ‘మధ్యవర్తిత్వం’ అని వెల్లడించారు.  

అవగాహన పెంచుకోవాలి..: ‘హైకోర్టు న్యాయమూర్తులు కూడా మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెంచుకోవాలి.  దేశంలో దాదాపు 5 కోట్లు, రాష్ట్రంలో 10 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రజలకు సత్వర న్యాయం ఎలా అందుతుంది? ఈ పరిస్థితులను అధిగమించేందుకు మధ్యవర్తిత్వం తోడ్పడుతుంది.’అని జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

‘జిల్లాస్థాయిల్లోనూ మీడియేషన్‌ సెంటర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, భార్యభర్తల గొడవలకు అక్కడే పరిష్కారం చూపిస్తే.. పెండింగ్‌ కేసుల భారం తగ్గే అవకాశం ఉంది’ అని జస్టిస్‌ నవీన్‌రావు అభిప్రాయపడ్డారు. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ సెంటర్‌ చైర్మన్‌ జార్జి లిమ్‌ వర్చువల్‌గా మాట్లాడారు.

అనంతరం జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత, జస్టిస్‌ అనుమప చక్రవర్తి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లు అడిగిన ప్రశ్నలకు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, జార్జి లిమ్‌ సమాధానం చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు,  లీగల్‌ సరీ్వసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శి(జడ్జి) గోవర్ధన్‌రెడ్డి, జడ్జి రాధిక, ౖహె కోర్టు రిజిస్టార్, అసిస్టెంట్‌ రిజిస్టార్‌లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top