41ఏ నోటీసులపై స్టే పొడిగింపు 

High Court Extends Stay Orders On 41A Notices Issued On BL Santosh - Sakshi

బీఎల్‌ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టు ఊరట 

తదుపరి విచారణ 22కు వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత బీఎల్‌ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్‌ (జగ్గుస్వామి), న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌కు సిట్‌ జారీ చేసిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై విధించిన స్టేను హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ 22వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సంతోష్‌ కు జారీ చేసిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై గత నెల 25న స్టే విధించిన విషయం తెలిసిందే.

తర్వాత జగ్గుస్వామి, శ్రీనివాస్‌లకు ఊరటనిచ్చింది. లుక్‌అవుట్‌ నోటీసులను కూడా నిలుపుదల చేసింది. సిట్‌ జారీ చేసిన 41ఏ, లుక్‌ అవుట్‌ నోటీసులను నిలుపుదల చేయాలని సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ కె.సురేందర్‌ మంగళవారం విచారణ చేపట్టారు. బీఎల్‌ సంతోష్‌ తరఫున సీనియర్‌ న్యాయ వాది దేశాయ్‌ ప్రకాష్‌రెడ్డి, జగ్గుస్వామి తరఫు సీనియర్‌ న్యాయ వాది వి.పట్టాభి, ప్రభుత్వం తరఫు అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు.

సంతోష్‌కు జారీ చేసిన నోటీసులను పూర్తిగా కొట్టివేయాలని ప్రకాష్‌రెడ్డి కోరారు. ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని, నోటీసులు ఇచ్చి ఆధారాలు లేకుండా అరెస్టు చేయాలని చూడటం చట్టవిరుద్ధమని పట్టాభి నివేదించారు. బీఎల్‌ సంతోష్, తుషార్‌ వెల్లపల్లి, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే.

వీరిని నిందితులుగా చేర్చడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. ఏసీబీ మాత్రమే ఈ కేసును విచారణ చేయాలని స్పష్టంచేసింది. ఈ అంశాలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే ట్రయల్‌కోర్టు ఉత్తర్వులను సిట్‌ సవాల్‌ చేయగా, ఇదే హైకోర్టు తీర్పును 21వ తేదీకి రిజర్వు చేసిన అంశాన్నీ రికార్డులోకి తీసుకున్నారు. దీంతో స్టేను పొడిగిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top