‘గులాబ్‌’ ఎఫెక్ట్‌.. తెలంగాణలో మళ్లీ కుండపోత, వీడియోలు | Sakshi
Sakshi News home page

Cyclone Gulab: తెలంగాణలో మళ్లీ కుండపోత, వీడియోలు

Published Tue, Sep 28 2021 1:34 AM

Heavy Rains In Telangana Due To Gulab Storm - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్‌ తుపాను ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన పొద్దంతా కురుస్తూనే ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో, గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగతాచోట్ల కూడా ఓ మోస్తరు వానలు పడ్డాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో రహదారులపై నీరు చేరింది. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరిసిల్లను ముంచెత్తిన వరద ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విస్తారంగా వానలు కురిశాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని సోమవారం రాత్రి మళ్లీ వరద ముంచెత్తింది. పట్టణంలోని శాంతినగర్, మెహర్‌నగర్, పద్మనగర్, జేపీనగర్, అనంతనగర్, సర్ధార్‌నగర్, అశోక్‌నగర్‌ ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలువురు బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించారు.


వరంగల్‌ ఆగమాగం.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, చిట్యాల, మహబూబాబాద్, నర్సంపేట, జనగాం, ములుగు, పరకాలతోపాటు మరికొన్ని మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఏజెన్సీలోని 23 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీటమునిగాయి. 28 కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ములుగు జిల్లాలోని బొగత జలపాతం, మహబూబాబాద్‌ జిల్లాలో భీమునిపాదం జలపాతం పొంగిపొర్లుతున్నాయి.



హైదరాబాద్‌ మల్లెపల్లిలో కాల్వను తలపిస్తున్న రహదారి 

మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో సీలింగ్‌ పెచ్చులు ఊడి పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. 
ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని మంజీరా నది పోటెత్తింది. ఘనపురం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమైంది. ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. 
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద బిక్కేరు వాగు పొంగిపొర్లుతోంది. బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌– అనాజ్‌పురం గ్రామాల మధ్య వంతెనపై నుంచి వరద పోటెత్తడంతో రాకపోకలను నిలిపివేశారు. మోత్కూరు, చౌటుప్పల్, రామన్నపేట, లక్కారం–చౌటుప్పల్‌ మధ్య ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.


 
వరదనీరు చేరడంతో చెరువులా మారిన చౌటుప్పల్‌ పట్టణంలోని గాంధీపార్క్‌  

సూర్యాపేట జిల్లా చౌటపల్లి, మఠంపల్లి, బక్కమంతులగూడెం, పెదవీడు, చింతలమ్మగూడెం చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. మునగాల మండలం తాడువాయి శివారులో ఉన్న రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. 
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం దాకా భారీ వర్షం కురిసింది. కెరమెరి, దహెగాం మండలాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. రాంపూర్, మొట్లగూడతో పాటు పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 
మంచిర్యాల జిల్లాలో వాగులు ఉప్పొంగడంతో వేమనపల్లి మండలంలో 15 గ్రామాలు, కోటపల్లి మండలంలో 14, భీమిని, కన్నెపెల్లి మండలాల్లో 8 గ్రామాలకు, నెన్నెల మండలంలో 7, చెన్నూర్‌ మండలంలో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 
భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, మున్నేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 100కుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 3,172 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి.

 నిండా మునిగిన హైదరాబాద్‌ 
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో సోమవారం పొద్దంతా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు చేరి.. జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు అవస్థ పడ్డారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement