దేనికింద ఏముందో.. ఏది కుంగనుందో? | Heavy rains lash Hyderabad roads damaged | Sakshi
Sakshi News home page

దేనికింద ఏముందో.. ఏది కుంగనుందో?

Aug 6 2025 12:55 PM | Updated on Aug 6 2025 1:19 PM

Heavy rains lash Hyderabad roads damaged

సాక్షి, హైదరాబాద్‌: నాలాలు కుంగిపోయి వాహనాలు దిగబడుతున్నా దిక్కేలేకుండా పోయింది. కుహరాల్లా కుంగిపోతున్నా బల్దియాకు సోయే లేకుండాపోతోంది. గత ఏడాది బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌– 11 ఉదయ్‌నగర్‌లో నాలా శ్లాబ్‌తో పాటు రిటైనింగ్‌ వాల్‌ కూలింది. గోషామహల్‌ చాక్నవాడి ప్రాంతంలో నాలాశ్లాబ్‌ స్వల్ప సమయంలోనే ఐదారుసార్లు కుంగింది.  ఈ సంవత్సరం కూడా  ఆ శ్లాబ్‌ కూలింది. వాహనాలు దిగబడ్డాయి. గతంలో నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌ ప్రాంతంలోనూ నాలాపైనున్న రోడ్డు కుంగిపోయింది. ఇలా ఎంతోకాలంగా  నగరంలోని నాలాల పైకప్పులు, నాలాలపై ఉన్న రోడ్లు కుంగిపోవడం, వాహనాలు అందులో దిగడం పరిపాటిగా మారినా ప్రమాదాలు జరగకుండా గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎలాంటి శ్రద్ధ చూపడంలేదు.  

పురాతన కాలం నాటివెన్నో..  
నగరంలోని నాలాలు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవి. నిజాం కాలం నాటి నాలాలూ వాటిల్లో ఉన్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన నాలాలు, వాటి పైకప్పులు (రోడ్లు) ఎలా ఉన్నాయి.. ఏమేర దెబ్బతిన్నాయి  వంటి అంశాలను అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. నాలాల కింద ఎక్కడెక్కడ ఏమేమున్నాయో తెలిసే ఇన్వెంటరీ కూడా జీహెచ్‌ఎంసీ వద్ద లేదు. దీంతో.. ఏ నాలా కింద ఏముందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదు. తాజాగా బంజారాహిల్స్‌లో నాలాలో వాటర్‌ ట్యాంకర్‌ దిగబడటంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచి్చంది. భారీ వాహనం కావడంతో నాలాలో పడిపోయింది. కనీసం నాలాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించేందుకు హెచ్చరికల బోర్డుల వంటివి సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు.  గతంలోనూ నాలాలపై రోడ్లు కుంగినప్పుడు సైతం  ఏ నాలా పరిస్థితి ఏమిటో, వాటికింద ఏమేమున్నాయో, రిటైనింగ్‌ వాల్స్‌ పరిస్థితేమిటో తెలుసుకోవాలనుకోలేదంటే అధికారుల తీరును అంచనా వేయవచ్చు.  

రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నా.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో 955 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడికతీతల కోసం దాదాపు రూ. 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ.. రోడ్ల దిగువనున్న నాలాల పరిస్థితిని పట్టించుకోవడం లేదు.  అదృష్టవశాత్తు నాలాల్లో వాహనాలు దిగబడినప్పుడు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.అదే వాహనాల్లో ఎక్కువమంది ఉండి ప్రమాదం తీవ్రమైతే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.  

ఆధునికీకరణ సరే.. ఆపదల మాటేమిటి? 
వరద ముంపు సమస్యల పరిష్కారం కోసం వ్యూహాత్మక నాలా అభివద్ధి పథకం కింద ఇప్పటికే దాదాపు రూ. 950 కోట్లు ఖర్చుచేశారు. నాలాల ఆధునికీకరణ, నీటి పారుదలకు బాక్స్‌ డ్రెయిన్ల నిర్మాణాల వంటివి చేపట్టారు కానీ.. పురాతన నాలాలపై కనీస శ్రద్ధ పెట్టలేదు. వీటిలో కాలనీలు, స్లమ్స్‌ మధ్యన ఉన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. నాలా రిటైనింగ్‌ వాల్స్‌నే ఆనుకుని వెలసిన అపార్ట్‌మెంట్లు సైతం ఉన్నాయి. అయినప్పటికీ, నాలాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. నాలా సేఫ్టీ ఆడిట్‌ పేరిట ప్రతి నాలానూ అధికారులు తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ, నాలాల శ్లాబ్‌ (రోడ్‌)లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేరు. శిథిల భవనాల విషయంలో మొక్కుబడి సర్వేలు చేస్తున్నప్పటికీ, పురాతన నాలాలు, వాటిపై ఉన్న రోడ్ల స్టెబిలిటీ గురించి మా త్రం కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. ఏ నాలా ఎప్పుడు కుంగుతుందో తెలియని దుస్థితి దాపురించింది.  

కాగితాలకే పరిమితం.. 
నాలా సేఫ్టీ చర్యల్లో భాగంగా ఇంజినీర్లు  క్షేత్రస్థాయిలో నడుచుకుంటూ వెళ్లి పరిశీలించాలి. రెండు మీటర్ల కంటే  ఎక్కువ వెడల్పున్న ఓపెన్‌ నాలాలకు అన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్‌ ఉండాలి. పైకప్పులున్న నాలాల్లో  ఎక్కడైనా కప్పులు దెబ్బతిన్నా, ఓపెన్‌గా ఉన్నా  గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నది కాగితాలకే పరిమితమైంది. వరదనీరు ఏ నాలా నుంచి ఎక్కడకు వెళ్తుందో కూడా తెలియని అధికారులున్నారంటే అతిశయోక్తి కాదు.  

బలహీనంగా నాలా కప్పులు  
నగరంలో ప్రస్తుతమున్న నాలా వ్యవస్థ గంటకు 20 మి.మీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. సగటున  గంటకు 60 మి.మీ.లకు పైగా వర్షపాతం న మోదవుతుండటంతో ఉన్న నాలాలు వర్షాన్ని తట్టుకునేలా లేవు. దాంతో నాలాల పైకప్పులూ బలహీనమవుతున్నాయి.  
000లో కురిసిన భారీ వర్షాలతో అప్పటి 
ఎంసీహెచ్‌ పరిధి వరకు వరద కాలువలపై అధ్యయనం చేసిన కిర్లోస్కర్‌ కమిటీ సమగ్ర నివేదిక రూపొందించింది.  
 170 కి.మీ పొడవున్న 71 నాలాలను తక్షణం విస్తరించాలని సూచించింది.  
2007లో జీహెచ్‌ఎంసీగా> రూపాంతరం చెందాక గ్రేటర్‌ పరిధి మొత్తానికి వాయెంట్స్‌ సొల్యూషన్స్‌ వరదనీటి కాలువలపై అధ్యయనం చేసింది.  
 20మి.మీ మించి వర్షం కురిసిన ప్రతిసారీ నగరం నీట మునుగుతోంది.  
 390 కి.మీ మేర మేజర్‌ నాలాలను ఆధునికీకరించాలని వాయెంట్స్‌ సొల్యూషన్స్‌ సూచించింది.  
 నాలాల వెంబడి బఫర్‌జోన్‌ పరిధిలో మొత్తం 28వేల అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించింది.  

రోడ్డు కుంగి నాలాలో కూరుకుపోయిన వాటర్‌ ట్యాంకర్‌
బంజారాహిల్స్‌: రోడ్‌ నెం– 1లోని మహేశ్వరి చాంబర్స్‌ అపార్ట్‌మెంట్‌ వీధిలో ఓ వాటర్‌ ట్యాంకర్‌ నాలాలో దిగబడిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి ఈ రోడ్డులోని నాలా కుంగిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్‌కు వస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్‌మెంట్‌ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డుకు రాకపోకలు నిలిచిపోయాయి. వాటర్‌ ట్యాంకర్‌ను వెలికితీసేందుకు 70 టన్నుల క్రేన్‌ కావాల్సి ఉంటుందని, ఇంత పెద్ద క్రేన్‌ నిలిపేందుకు అక్కడ స్థలం లేకపోవడంతో సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. రాత్రి వరకు క్రేన్‌ ద్వారా నాలాలో పడిపోయిన ట్యాంకర్‌ను తొలగిస్తామని ఈఈ విజయ్‌కుమార్‌ తెలిపారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన నాలా కావడంతో కుంగిపోయిందని అధికారులు గుర్తించారు.

మాస్టర్‌ప్లాన్‌ ఏదీ?
నాలాలపై ఉన్న రోడ్లపై వాహనాల రాకపోకలతో దెబ్బతినే ప్రమాదాలున్నందున నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు.  
 వర్షం వచి్చనప్పుడు నీరు నాలాల్లో చేరినప్పటి నుంచి ఎక్కడి నుంచి వెళ్లి ఎక్కడ కలుస్తోంది వంటి వివరాలు లేవు. 
నిర్వహణ లేదు. నాలాలకు మాస్టర్‌ప్లాన్‌ అనేదేమీ లేదు.  
అక్రమ నిర్మాణాల కారణంగానూ నాలా పరిసరాలు బలహీనమవుతున్నాయి. 
 నాలాలకు అడ్డుగా ఉన్న పైపులైన్లు తదితర యుటిలిటీస్‌ను తరలించడం, నాలాల్లో చెత్తా చెదారాలు చేరకుండా చూడాల్సి ఉంది.  
పైకప్పుల్ని బలోపేతం చేయాల్సి ఉంది.

కాంక్రీట్‌ కప్పుల వల్లే.. 
నాలాలపై కాంక్రీట్‌ కప్పుల (రోడ్ల) వల్ల లోపల మరమ్మతులు చేయలేని పరిస్థితులుంటున్నాయి. లీకేజీలు గుర్తించలేకపోతున్నారు. చాలాకాలం క్రితం నిర్మించిన నాలాల పైకప్పులు బీటలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అంబర్‌పేట, బేగంబజార్, విజయ్‌నగర్‌ కాలనీ, మలక్‌పేట తదితర ప్రాంతాల్లోనూ కప్పులు దెబ్బతిని ప్రమాదాలు జరిగాయి. వీటికి తగిన పరిష్కారాలపై దృష్టి సారించాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement