తెలంగాణలోనే అత్యున్నత పోలీసింగ్‌ 

Heavy Policing In Telangana Says DGP Mahender Reddy - Sakshi

సైబ్‌–హర్‌ ముగింపు కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో శాంతి భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని మహిళలు, యువతకు నిర్వహించిన వెబ్‌ ఆధారిత చైతన్య సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పోలీస్‌ శాఖ ఆధునీకరణకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉందన్నారు. మహిళలు, పిల్లలు సైబర్‌ నేరాల బారిన పడకుండా నెలరోజులపాటు సైబ్‌–హర్‌ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు.

కార్యక్రమంలో రాష్ట్రంతోపాటు దేశ, విదేశాలకు చెందిన 50 లక్షల మంది పాల్గొనడం విశేషమని కొనియాడారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. సైబ్‌–హర్‌ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని వెల్లడించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన మై విలేజ్‌ షో గంగవ్వ మాట్లాడుతూ.. తనను కూడా పైసల్‌ గీకే కార్డు (ఏటీఎం) నంబర్‌ చెప్పాలని ఫోన్‌లో ఎవడో అడిగాడని, అయినా చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాలపై చైతన్యం కలిగించే పలు ప్రచార కిట్‌లను మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్‌ కూడా పాల్గొన్నారు. 

15 లక్షల మందికి అవగాహన..: జూలై 15న మొదలైన ఈ కార్యక్రమం ద్వారా నెలరోజులపాటు రాష్ట్రంలోని దాదాపు 15 లక్షలకుపైగా యువత, మహిళలకు ఆన్‌లైన్‌ నేరాలు, అప్రమత్తత, రక్షణ పొందే విధానం, ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి విషయాలపై అవగాహన కల్పించడం విశేషం. కాగా, ఈ కార్యక్రమం సైబర్‌ నేరాలపై ప్రత్యేక పుస్తకాలు వెలువరించింది. యువతలో ఆసక్తిని పెంచేలా పలు క్విజ్‌లు, వ్యాసరచన, పోస్టర్‌ ప్రజెంటేషన్, కవితలు తదితర పోటీలు కూడా నిర్వహించింది. పోస్టర్‌ ప్రజెంటేషన్‌ కోసం అత్యధికంగా 367 మంది చిత్రాలను పంపారు. వారిలో రితిక్, నమ్రతలు విజేతలుగా నిలిచారు. ఇక కవితల పోటీల విభాగంలో దాదాపు 100కు పైగా రాగా.. వాటిలో హైమా, అన్షు, సాయి నిక్షేప్, హరికాంత్, రమాదేవిల కవితలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top