
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ప్రపంచ శాంతి ఉత్సవం నిర్వహించుకొనేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సభలో వెయ్యి మందికి మించి ప్రజలు పాల్గొనరాదని.. ప్రార్థనలు మినహా ఇతర ప్రేరేపిత ప్రసంగాలు చేయరాదని సభ నిర్వహిస్తున్న గ్లోబల్ పీస్ ఫెస్టివల్‌కు స్పష్టం చేసింది. సభ శాంతియుతంగా సాగేలా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానికి సొసైటీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. నిబంధనలు ఉల్లంఘించినా లేక దేశ ప్రయోజనాలకు, సమగ్రతకు విరుద్ధమైన నినాదాలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ గోస్పెల్ సొసైటీ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.