వలస కార్మికులకు బంపర్‌ ఆఫర్‌

Gulf Jobs Interviews at Jagtial And Nizambad - Sakshi

ఉచిత వీసాలు జారీ చేస్తున్న యూఏఈ కంపెనీ

విమాన టికెట్టునూ భరించనున్న సంస్థ

జగిత్యాల, నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలు 

మోర్తాడ్‌: వలస కార్మికులకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పరిధిలోని ఏడీఎన్‌హెచ్‌ కంపాస్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. తమ సంస్థలో క్లీనింగ్‌ సెక్షన్‌లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫ్రీ రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. కార్మికులకు ఉచిత వీసాలతోపాటు విమాన టికెట్‌ చార్జీలను కూడా ఆ సంస్థే భరించనుంది. జీటీఎం ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జగిత్యాలలోని హోటల్‌ పీఎం గ్రాండ్‌లో, 15న నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న తరుణంలో వలస కార్మికులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఉచితంగా వీసాలను జారీ చేయడానికి ఏడీఎన్‌హెచ్‌ కంపెనీ ఫ్రీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. క్లీనర్‌లుగా పని చేసే కార్మికులకు ప్రతి నెలా రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత వసతి, భోజనం లేదా అలవెన్సుల రూపంలో అదనంగా చెల్లిస్తారు. వలస కార్మికులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడానికి రవాణా సదుపాయాన్ని కూడా కంపెనీయే కల్పించనుంది. 

ఉచితంగా జారీ చేస్తున్న వీసాలకు కార్మికులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే ఏడీఎన్‌హెచ్‌ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, కష్టాల్లో ఉన్న వలస కార్మికులకు మేలు చేసేందుకు యూఏఈ కంపెనీ ఉచిత వీసాలు, విమాన టికెట్‌లను జారీ చేస్తుండడం హర్షించదగ్గ విషయమని పలువురు వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్‌: రెవెన్యూలో పదోన్నతులు!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top