
కుస్తీ పోటీలకు పెరుగుతున్న ఆదరణ
పండుగల సందర్భంగా పలు గ్రామాల్లో నిర్వహణ
పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మల్లయోధులు
తిలకించేందుకు తరలి వస్తున్న జనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: చుట్టూ కేరింతలు కొడుతూ ఉత్సాహ పరిచే జనం.. ఎదురుగా ఉడుంపట్టు పట్టి పడగొట్టడానికి సిద్ధంగా ప్రత్యర్థి.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గట్టి పట్టు పడితేనే వరించే విజయం.. ఆ గెలుపు ఇచ్చే కిక్కే వేరు.. నిర్వాహకులు అందజేసే బహుమతి కన్నా.. ఆ కిక్కు కోసమే మల్లయోధులు పోటీలకు తరలి వస్తుంటారు. పలువురు సరిహద్దులు దాటి వచ్చి తలపడతారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుస్తీ పోటీలకు ఆదరణ పెరుగుతోంది. జుక్కల్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలోని పలు ప్రాంతాల్లో పండుగల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఉగాది, శివరాత్రి, హోలీ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి తదితర పండుగల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు.
ఆయా ప్రాంతాల్లోని గ్రామ దేవతల ఉత్సవాలైన అల్లమ ప్రభు జాతర, భేతాళ జయంతి, మత్తడి పోచమ్మ ఉత్సవాలు, ప్రభుస్వామి ఉత్సవాలు, పెద్దమ్మ, దుర్గమ్మ ఉత్సవాలలో కుస్తీ పోటీలు జరుగుతాయి. పోటీలకు ఇరు జిల్లాలకు చెందిన వారే కాకుండా.. పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా మల్లయోధులు వస్తుంటారు. పోటీలకు వేలాది మంది హాజరై ఈలలు కొడుతూ ఉత్సాహపరుస్తుంటారు.

విజేతలను అభినందిస్తూ ఊరేగిస్తారు. నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్, బోధన్, వర్ని, జుక్కల్, ఎడపల్లి, పెద్దకొడప్‌గల్, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ మధ్య కాలంలో పోటీల్లో ఆడపిల్లలు కూడా పాల్గొంటుండటం విశేషం. కొన్నిసార్లు ఆడపిల్లలు మగవారిని ఓడించి విజేతలుగా నిలుస్తున్నారు.
దశాబ్దాలుగా నిర్వహణ..
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో తరతరాలుగా కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల తాతలు, తర్వాతి కాలంలో తండ్రులు, ఇప్పుడు వారి కొడుకులు.. పోటీల్లో పాల్గొంటూ వారసత్వాన్ని కొనసాగిస్తుండటం విశేషం. తమది మల్లయోధుల కుటుంబం అంటూ గొప్పగా చెప్పుకొనేవారు చాలామంది ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్, అడవి లింగాల, మత్తమాల, రుద్రారం, తిమ్మారెడ్డి, అల్మాజీపూర్, భిక్కనూరు, నస్రుల్లాబాద్, బొమ్మన్‌దేవ్‌పల్లి, సంగం, దుర్కి, నాచుపల్లి, మైలారం, మిర్జాపూర్, దామరంచ, కిష్టాపూర్, బీర్కూర్, దేశాయిపేట, నెమ్లి, లింగంపేట, బోనాల్, లింగంపల్లి కుర్దు, ముంబోజీపేట, జల్దిపల్లి, మెంగారం, బాణాపూర్, భవానీపేట, ఐలాపూర్, ఎక్కపల్లి, సజ్జన్‌పల్లి, కోర్పోల్, గౌరారం, గాంధారి, జుక్కల్, పోచారం, నిజామాబాద్ జిల్లాలోని పెగడాపల్లి, కందకుర్తి, సాలూర, బోధన్ పట్టణం, ఎరాజ్‌పల్లి, హందాపూర్, కల్దుర్కి, హున్సా, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి, ఠాణాకలాన్, మంగళ్‌పాడ్, జాన్కంపేట్, జన్నెపల్లి, రెంజల్, కల్యాపూర్, దూపల్లి, కందకుర్తి, బోర్గాం, సాటాపూర్, కోటగిరి, అంబం, చిక్కడ్‌పల్లి, గోవూర్, చందూర్ తదితర గ్రామాల్లో పండుగల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు.

కొత్త తరం కూడా..
కొన్ని గ్రామాల్లో కొత్తతరం కూడా కుస్తీ పోటీలకు సిద్ధమవుతోంది. అప్పట్లో తమ తాతలు, తండ్రులు కుస్తీ పోటీల్లో పాల్గొనేవారని, వారి వారసత్వంగా తాము కూడా సై అంటూ చాలాచోట్ల కొత్త తరం పోటీల్లో పాల్గొంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే కుస్తీ పోటీల్లో కొత్త తరం పాల్గొని సత్తా చాటుతోంది. పోటీలపై గ్రామీణ ప్రాంతాల్లో ఏటేటా ఆసక్తి పెరుగుతోంది.