క్యూర్‌లో వాటర్‌ పూర్‌ | Groundwater is in a very critical condition in Hyderabad | Sakshi
Sakshi News home page

క్యూర్‌లో వాటర్‌ పూర్‌

May 25 2026 1:07 AM | Updated on May 25 2026 1:07 AM

Groundwater is in a very critical condition in Hyderabad

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం

భారీ భవనాలు, రోడ్లతో నిండిపోయిన హైదరాబాద్‌ మహానగరం, పరిసర ప్రాంతాలు

వర్షపు నీళ్లు ఇంకడానికి కరువైన నేల..ఆపై కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు

హైదరాబాద్‌ మహానగరం, పరిసర ప్రాంతాల్లో ఇంకే వర్షపు నీళ్ల కంటే తోడే భూగర్భ జలాల పరిమాణమే అధికం

భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా పరిగణించే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో భూగర్భ జలాలు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాయి. హైదరాబాద్‌ మహానగరంతోపాటు శివారు ప్రాంతాలు భారీ భవనాలు, సీసీ రోడ్లతో పూర్తిగా కాంక్రీట్‌ జంగిల్‌గా తయారు కావడం.. చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో చుక్క వర్షపు నీరు సైతం ఇంకడానికి జానెడు నేల మిగలలేదు. దీనికితోడు రాతి పొరలతో నిండిన దక్కన్‌ పీఠభూమి కావడంతో వర్షపు నీరు ఇంకడానికి అవకాశమూ లేదు. దీంతో హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాల రీచార్జ్‌ పరిమాణంతో పోల్చితే వాటి వినియోగం మించిపోయింది.  

హైదరాబాద్‌ జిల్లాలోనే అత్యంత దుర్భర పరిస్థితిలో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 16 మండలాలుండగా, 8 మండలాల్లో (50 శాతం) విచ్చలవిడి (ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌)గా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. అంటే, ఒక ఏడాది రీచార్జ్‌ అయిన భూగర్భ జలాలతో పోల్చితే ఎక్కువ భూగర్భ జలాలను హైదరాబాద్‌ జిల్లాలో తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్‌పేట్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్‌ మండలాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. మరో 7 మండలాల్లో (43.75%) క్రిటికల్‌ స్థాయిలో భూగర్భ జలాలు వాడుతుండగా, వీటిలో మారేడ్‌పల్లి, బండ్లగూడ, బహదూర్‌çపుర, ముషీరాబాద్, నాంపల్లి, షేక్‌పేట్, సికింద్రాబాద్‌ మండలాలున్నాయి. ఒక్క తిరుమలగిరి మండలం (6.25 శాతం)లో సెమీ క్రిటికల్‌ స్థాయిల్లో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని ఒక్క మండల పరిధిలో కూడా భూగర్భ జలాలు సురక్షితంగా లేవు. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలమండలి రూపొందించిన భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025లో ఈ అంశాలను వెల్లడించింది.  

⇒ మేడ్చల్‌–మల్కాజ్‌గిరిలోని 15 మండలాల్లో 4 మండలాలు (26.67 శాతం) భూగర్భ జలాలను ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చేస్తున్నాయి. వీటిలో బాలానగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాలున్నాయి. జిల్లాలోని మరో 3 మండలాల్లో (20 శాతం) క్రిటికల్‌ స్థాయిలో భూగర్భ జలాల వాడకం ఉంది. వీటిలో మూడుచింతలపల్లి, కీసర, బాచుపల్లి ఉన్నాయి. అల్వాల్, మేడ్చల్, ఘట్‌కేసర్‌ మండలాల్లో (20 శాతం) సెమీ క్రిటికల్‌ స్థాయిలో వాడకం ఉంది. జిల్లాలోని మిగిలిన 5 మండలాల్లో (33.33 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాల వాడకం ఉంది.  

⇒ రంగారెడ్డిలో 27 మండలాలుండగా, 4 మండలాలైన చౌదరిగూడ, హయాత్‌నగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌(14.81 శాతం)లో భూగర్భ జలాలను ఓవర్‌ ఎక్స్‌ప్లయిటెడ్‌ చేస్తున్నారు. మరో 9 మండలాలైన ఆమనగల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొందుర్గు, తలకొండపల్లి, కొత్తూరు, మొయినాబాద్, కందుకూరు, రాజేంద్రనగర్‌ (33.33 శాతం)లో సెమీ క్రిటికల్‌ స్థాయిలో వినియోగం ఉంది. ఈ జిల్లాల్లోని మిగిలిన 14 మండలాల్లో (51.85 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాలను వాడుతున్నారు.  

⇒ ప్యూర్, రేర్‌ రీజియన్ల పరిధిలోని ఇక ఇతర జిల్లాలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌ అర్బన్, ఖమ్మంలోని రఘునాథపాలెం, నల్లగొండలోని మునుగోడు, నిజామాబాద్‌ దక్షిణ, సంగారెడ్డిలోని పటాన్‌చెరు, యాదాద్రి భువనగిరిలోని ఆత్మకూరు–ఎం, నారాయణపూర్‌ మండలాల్లో భూగర్భ జలాల ఓవర్‌ ఎక్సప్లయిటేషన్‌ జరుగుతోంది.  

774 టీఎంసీల జలాలు రీచార్జ్‌ 
రాష్ట్రంలో 2025 సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలతో 259.2 టీఎంసీలు, ఇతర వనరులతో 382.81 టీఎంసీలు, వర్షాకాలం తర్వాత వర్షాలతో 32.48 టీఎంసీలు, ఇతర వనరులతో 233.07 టీఎంసీలు కలిపి మొత్తం 774.45 టీఎంసీల భూగర్భ జలాలు వృద్ధి అయ్యాయి. అందులో సహజ కారణాలతో 73.8 టీఎంసీలు వృథాగా ప్రవహించగా, మిగిలిన 700.64 టీఎంసీలు వాడుకోవడానికి లభ్యతలోకి ఉన్నాయి. ఇక సాగునీటికి 292.4 టీఎంసీలు, పరిశ్రమలు 14.12 టీఎంసీలు, గృహాలు 20.83 టీఎంసీలు కలిపి మొత్తం 327.01 టీఎంసీల (46.69 శాతం)ను 2025లో రాష్ట్రం వాడుకుంది. భవిష్యత్‌ అవసరాలకు 376.8 టీఎంసీల భూగర్భజలాల నిల్వలు మిగిలాయి. 2024తో పోలి్చతే 2025లో భూగర్భ జలాల రిచార్జ్‌ 720.41 టీఎంసీల నుంచి 774.45 టీఎంసీలకు పెరిగింది.  

76 మండలాల్లో సురక్షితమే.. 
రాష్ట్రంలోని 620 మండలాల్లో భూగర్భ జలాల రీచార్జ్‌ వినియోగంపై మదింపు జరపగా, 23 మండలాల్లో (3.71 శాతం) ఓవర్‌ ఎక్స్‌ప్లయిటేషన్, 19 మండలాల్లో(3.06%) క్రిటికల్, 105 మండలాల్లో (16.94శాతం) సెమీ క్రిటికల్, 473 మండలాల్లో (76.29 శాతం) సురక్షితంగా భూగర్భ జలాలున్నట్టు నిర్థారించారు.  
 
స్థానికంగా భూగర్భ జలాల రీచార్జ్‌తో పోల్చితే వినియోగ స్థాయి ఆధారంగా ఓవర్‌ ఎక్స్‌ప్లయిటేషన్, క్రిటికల్, సెమీ క్రిటికల్, సేఫ్‌ అనే నాలుగు కేటగిరీలుగా ప్రాంతాలను కేంద్ర భూగర్భ జలమండలి విభజించింది. ఆ వివరాలను పట్టికలో చూడొచ్చు..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement