కేంద్ర నిధులకు అనుగుణంగా విడుదల కాని రాష్ట్ర ప్రభుత్వ వాటా
గత రెండేళ్లలో జీపీలకు రూ.1,011 కోట్లు మాత్రమే కేటాయింపు
మొత్తం రూ.2,979 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్
గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి: సర్పంచులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను నిధుల లేమి సమస్య వెంటాడుతోంది. తాజాగా మే 1 నాటికి విడుదల కావాల్సిన రూ. 2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు అందకపోవడం, నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల గ్రామాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోతున్నారు. గ్రామాల్లో మురుగునీటి కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు, శ్మశానవాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి పనులకు అంతరాయం ఏర్పడుతోందని, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.
కేంద్రం ఇస్తున్నా...‘మ్యాచింగ్’ లేదు..
కేంద్రం విడుదల చేసిన నిధులు సకాలంలో గ్రామ స్థాయికి చేరడం, గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించడానికి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు సకాలంలో విడుదల చేయడం అత్యంత అవశ్యం కాగా.. ఈ విషయంలో రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు తేట తెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధాన బకాయిలను చెల్లించినప్పటికీ, రాష్ట్రం మాత్రం నామమాత్రంగానే నిధు లు విడుదల చేసింది. 2026 సంవత్సరం ప్రారంభం నాటికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీలకు రూ.3,991 కోట్లు విడుదల కావాల్సి ఉంటే కేవలం రూ.1,011 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కేంద్రం ఇటీవల 2026–27 సంవత్సరానికి రూ.619 కోట్లకు పైగా విడుదల చేసినప్పటికీ, గ్రామీణ స్థానిక సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటుండటం గమనార్హం. కేంద్రం 15వ ఆర్థిక సంఘం టైడ్, అన్‌టైడ్ గ్రాంట్లను విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరిలో రూ.387.53 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ.619.85 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ గ్రాంట్లకు సమాన నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2026 నివేదికల ప్రకారం.. కేంద్రం రూ.1,900.45 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా (మ్యాచింగ్ గ్రాంట్) కింద కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్‌లు విడుదల చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాదాపు రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం (రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు) పంచాయతీలకు రూ.1,011 కోట్లు మాత్రమే మ్యాచింగ్ గ్రాంట్ల కింద ఇచ్చింది. 2024–25లో ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.611 కోట్లు, 2025–26లో ఇప్పటివరకు రూ.400 కోట్లు మాత్రమే (మొత్తం కలిపి రూ.1,011కోట్లు) మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇంకా రూ.2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత భారీగా కేంద్ర నిధులు
గత రెండున్నరేళ్లుగా (ముఖ్యంగా 2024–2026 మధ్య) తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పంచాయతీ ఎన్నికలు జరగని కారణాల వల్ల నిలిచిపోయినప్పటికీ, 2025 డిసెంబర్ చివరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు బాధ్యతలు స్వీకరించాక (డిసెంబర్ 22, 2025) రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సమరి్పంచడంతో నిధుల విడుదల వేగవంతమైంది. మొత్తం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో తెలంగాణకు సుమారు రూ.9,000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, అందులో ఎక్కువ భాగం విడుదలయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల జరిగినప్పటికీ.. 2026 మార్చి 31 లోగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ) నిర్వహణలో జాప్యం కారణంగా, సుమారు రూ.550 కోట్ల కేంద్ర నిధులు రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయని, ఇప్పుడు వాటిని రాష్ట్రం తిరిగి రాబట్టుకోలేకపోతోందని అధికార వర్గాల సమాచారం.
నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం కూడా పంచాయతీల బకాయిలు పూర్తిగా చెల్లించకుండా కేవలం 2023– 2024 సంవత్సరానికి విడుదల చేయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్‌ఎఫ్‌సీ నిధులు కానీ, మ్యాచింగ్ గ్రాంట్ కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.
– పాలకొండ ప్రణీల్ చందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం


