Finance Commission Grants
-
ఇస్తే 'మ్యాచింగ్' అభివృద్ధి స్వింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను నిధుల లేమి సమస్య వెంటాడుతోంది. తాజాగా మే 1 నాటికి విడుదల కావాల్సిన రూ. 2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు అందకపోవడం, నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల గ్రామాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోతున్నారు. గ్రామాల్లో మురుగునీటి కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు, శ్మశానవాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి పనులకు అంతరాయం ఏర్పడుతోందని, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.కేంద్రం ఇస్తున్నా...‘మ్యాచింగ్’ లేదు.. కేంద్రం విడుదల చేసిన నిధులు సకాలంలో గ్రామ స్థాయికి చేరడం, గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించడానికి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు సకాలంలో విడుదల చేయడం అత్యంత అవశ్యం కాగా.. ఈ విషయంలో రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు తేట తెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధాన బకాయిలను చెల్లించినప్పటికీ, రాష్ట్రం మాత్రం నామమాత్రంగానే నిధు లు విడుదల చేసింది. 2026 సంవత్సరం ప్రారంభం నాటికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీలకు రూ.3,991 కోట్లు విడుదల కావాల్సి ఉంటే కేవలం రూ.1,011 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం ఇటీవల 2026–27 సంవత్సరానికి రూ.619 కోట్లకు పైగా విడుదల చేసినప్పటికీ, గ్రామీణ స్థానిక సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటుండటం గమనార్హం. కేంద్రం 15వ ఆర్థిక సంఘం టైడ్, అన్‌టైడ్ గ్రాంట్లను విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరిలో రూ.387.53 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ.619.85 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ గ్రాంట్లకు సమాన నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2026 నివేదికల ప్రకారం.. కేంద్రం రూ.1,900.45 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా (మ్యాచింగ్ గ్రాంట్) కింద కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాదాపు రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం (రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) నిధులు) పంచాయతీలకు రూ.1,011 కోట్లు మాత్రమే మ్యాచింగ్ గ్రాంట్ల కింద ఇచ్చింది. 2024–25లో ఎస్ఎఫ్సీ నిధులు రూ.611 కోట్లు, 2025–26లో ఇప్పటివరకు రూ.400 కోట్లు మాత్రమే (మొత్తం కలిపి రూ.1,011కోట్లు) మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇంకా రూ.2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత భారీగా కేంద్ర నిధులు గత రెండున్నరేళ్లుగా (ముఖ్యంగా 2024–2026 మధ్య) తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పంచాయతీ ఎన్నికలు జరగని కారణాల వల్ల నిలిచిపోయినప్పటికీ, 2025 డిసెంబర్ చివరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు బాధ్యతలు స్వీకరించాక (డిసెంబర్ 22, 2025) రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సమరి్పంచడంతో నిధుల విడుదల వేగవంతమైంది. మొత్తం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో తెలంగాణకు సుమారు రూ.9,000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, అందులో ఎక్కువ భాగం విడుదలయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల జరిగినప్పటికీ.. 2026 మార్చి 31 లోగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) నిర్వహణలో జాప్యం కారణంగా, సుమారు రూ.550 కోట్ల కేంద్ర నిధులు రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయని, ఇప్పుడు వాటిని రాష్ట్రం తిరిగి రాబట్టుకోలేకపోతోందని అధికార వర్గాల సమాచారం. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం కూడా పంచాయతీల బకాయిలు పూర్తిగా చెల్లించకుండా కేవలం 2023– 2024 సంవత్సరానికి విడుదల చేయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్ఎఫ్సీ నిధులు కానీ, మ్యాచింగ్ గ్రాంట్ కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. – పాలకొండ ప్రణీల్ చందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం -
రాష్ట్రాలకు పీడీఆర్డీ నిధులను విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పదిహేడు రాష్ట్రాలకు చెందిన నాలుగో విడత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు రూ .9,871 కోట్లను గురువారం రోజున విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను అర్హత గల రాష్ట్రాలకు మొత్తం 39,484 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు మంజూరు చేయబడుతుంది. 15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని భర్తీ చేయడానికి ఈ గ్రాంట్లను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. 2021-22 మధ్య కాలంలో 17 రాష్ట్రాలకు పీడీఆర్డీ గ్రాంట్లను ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ .1,18,452 కోట్ల పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇప్పటివరకు రూ .39,484 కోట్లు (33.33 శాతం) నాలుగు విడతలుగా విడుదలయ్యాయి. ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
అధికారిక అవినీతి!
⇒ మురిగిపోకుండా అడ్వాన్స్ ⇒ రికార్డింగ్ పేరుతో నిధులు డ్రా ⇒ పనులు కాకుండానే ఎం బుక్కుల్లో నమోదు ⇒ మెటీరియల్ పేరుతో నిధులు పక్కదారి ⇒ మండల ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు ⇒ పనులు చేయకుండా బిల్లులు డ్రా చేస్తే ఎక్కడ ఇరుక్కుంటామోనని ఆందోళన ⇒ {పభుత్వమే ఒత్తిడి తెస్తోందంటున్న ఉన్నతాధికారులు ఓచర్లు తయారవుతున్నాయి.. బిల్లులు చకచకా రెడీ అయిపోతున్నాయి.. పనులు జరక్కుండానే డ్రా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులను అడ్డంగా బొక్కేందుకు ఇటు అధికారులు.. అటు అధికార పార్టీ నేతలు చాపకింద నీరులా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఏ విధంగా డ్రా చేయాలి.. ఏ విధంగా సొమ్ము చేసుకోవాలనే అంశంపై బుధవారం క్షేత్ర స్థాయి ఇంజినీర్లకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. విశాఖపట్నం: ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రాష్ర్ట వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో రూ.400 కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి ఉంది. ఒక్క విశాఖలోనే రూ.150 కోట్లకు పైగా ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. ఏటా మురిగిపోతున్న ఈ నిధులను ఈసారి ఎలాగైనా వెనక్కి మళ్లనీయకుండా ఉండాలన్న పట్టుదలతో పంచాయతీలకు ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా చేర్చి గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. తొలుత 50ః50 నిష్పత్తిలో, ఆ తర్వాత 30ః70 నిష్పత్తిలోనూ.. చివరకు 10ః90 నిష్పత్తి చొప్పున మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఖర్చు చేసేందుకు రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో ప్రతిపాదించారు. ఈ విధంగా పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులకు రూ.278 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ నిధులను జతచేర్చి ఏకంగా 650 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టేందుకు 6150 పనులను ప్రతిపాదించారు. మార్చి-31కల్లా కనీసం 300 కిలోమీటర్ల మేరైనా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు ఆదరాబాదరాగా 260 కిలోమీటర్ల మేర 1200 వరకు పనులు పూర్తిచేసినట్టుగా లెక్క తేల్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.98 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు చేయగా.. మరో రూ.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రారంభంకాని రూ.140 కోట్ల పనులు మిగిలిన రూ.140 కోట్లకు సంబంధించిన పనుల్లో ఎక్కడా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. అయినా సరే ప్రారంభమైనట్టుగా అడ్వాన్స్ రికార్డింగ్ చేసి ఎం బుక్‌లో నమోదు చేయాలంటూ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఏఈలు, మండల ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పనులు జరక్కుండానే ఏ విధంగా బిల్లులు తయారు చేయాలి. ఏ విధంగా అడ్వాన్స్ రికార్డింగ్ చేయాలి.. ఏ విధంగా ఎంబుక్‌ల్లో నమోదుచేయాలి వంటి విషయాలపై బుధవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో వారికి ప్రత్యేక క్లాస్ కూడా తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిధులు వెనక్కి మళ్లిపోవడానికి వీల్లేదని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయనని.. అవసరమైతే నిబంధనలను పక్కన పెట్టి అడ్వాన్స్ రికార్డింగ్‌తో నెలాఖరులోగా నిధులన్నీ డ్రా చేసి తీరాలని వారికి తేల్చి చెప్పారు. ఇందుకోసం మెటీరియల్ కొన్నట్టుగా ఓచర్లు సృష్టించి బిల్లులు డ్రా చేయాలని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే డ్రా చేసిన రూ.98 కోట్లకు సంబంధించిన పనులు కాని.. ఇంకా డ్రా చేయాల్సి ఉన్న రూ.40 కోట్లకు సంబంధించిన పనులు కానీ నూటికి నూరు శాతం పూర్తి కాని పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. నిబంధనలు కఠినంగా ఉన్నా.. నిబంధనలను పక్కన పెట్టి అడ్డదిడ్డంగా సీసీ రోడ్లు నిర్మించారే తప్ప.. ఎక్కడా బెర్ములు, డ్రైన్లు నిర్మించిన పాపాన పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. ఎం-30 స్టాండర్డ్ (ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక)లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్డు లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో కానీ, వాటర్ ప్యూరింగ్‌లో కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25 వేల చొప్పున కోత పెట్టొచ్చు.. పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలే కాదు తీవ్రతను బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు ఇంతలా ఉన్నప్పటికీ వీటిని పక్కన పెట్టి బిల్లులు డ్రా చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మండల ఇంజినీరింగ్ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులు కావడంతో పనులు జరక్కుండా బిల్లులు డ్రాచేస్తే తాము అడ్డంగా ఇరుక్కుంటామని ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్, మోటనరింగ్ కమిటీతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా ఈ పనులను నిశితంగా పరిశీలిస్తుందని.. బిల్లుల్లో కానీ, పనుల నాణ్యతలో కానీ ఏ చిన్న తేడా వచ్చినా తమ బతుకులు రోడ్డున పడ్డట్టేనని నర్సీపట్నం డి విజన్‌కు చెందిన ఓ మండల ఇంజినీరింగ్ అధికారి సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా సరే మేం చూసుకుంటాం.. బిల్లులు పెట్టండి.. సొమ్ములు డ్రా చేయండంటూ ఎస్ఈ, ఈఈలు తమపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి: సంబంధిత జిల్లా అధికారులను వివరణ కోరితే ప్రభుత్వం నుంచి తమపై కూడా అదే రీతిలో ఒత్తిళ్లు వస్తున్నాయని.. తామేం చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ నెలాఖరులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసినట్టుగా ఎంబుక్‌ల్లో నమోదు చేసి మొత్తం నిధులు స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.


