ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ | Govt comprehensive action plan to tackle El Niño Minister Uttam Kumar | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ

Oct 23 2026 9:16 PM | Updated on Oct 23 2026 9:16 PM

Govt comprehensive action plan to tackle El Niño Minister Uttam Kumar
  • ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు
  • కరవు ప్రభావిత మండలాల గుర్తింపు నుంచి నీటి సంరక్షణ వరకు పటిష్ట చర్యలు
  • తాగునీరు, సాగునీటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు..
  • ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
  • అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలను చైతన్యపరచాలి
  • రైతులకు అండగా ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే  కరువును  ముందుగానే అంచనా వేసి తాగునీరు, సాగునీటి లభ్యతను కాపాడటంతో పాటు విద్యుత్‌ సరఫరా, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి వంటి కీలక రంగాలకు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల వారీగా సమగ్రంగా కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది.

నియమిత గడువు అక్టోబర్ 31 తేదీ లోగా రాష్ట్రంలోని కరువు మండలాలను ప్రకటించడంతో పాటు, ఎల్ నినో, కరువు పరిస్థితులను చర్చించడానికి అఖిల పక్ష సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించింది.  రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్-నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది.  

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్ నినో ,  కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.‎ఈ సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సిఎస్ సంజయ్ జాజుతో పాటు సంబంధిత శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,  కరవు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా గుర్తించి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కరువు ప్రభావాన్ని తగ్గించి, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు సమయానికి అందించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరువు పరిస్థితులను శాస్త్రీయంగా విశ్లేషించి, అర్హత కలిగిన మండలాలను గుర్తించాలని సూచించారు. 

ఇప్పటికే కరువు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు, 20 శాతానికి మించి కరువు ప్రభావం ఉన్న మండలాల పరిస్థితులను కూడా పరిశీలించాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశంపై సిఫార్సులు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కరువు ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉండబోతోందో ముందుగానే అంచనా వేస్తే, ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించేందుకు వీలవుతుందని చెప్పారు. 

అందుకే ప్రతి శాఖ తన పరిధిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్‌ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాఖ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందించేందుకు అన్ని శాఖలు తమ అవసరాలను ముందుగానే అంచనా వేయాలని, అత్యవసర ఖర్చుల కోసం ఆర్థిక శాఖ తగిన విధంగా సహకరించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

వ్యవసాయ రంగంపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు రానున్న పంటల సీజన్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. కరువు, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమస్యలు తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే వాటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని పేర్కొన్నారు. 

ఈ సందర్బంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాల్లో ప్రతి వారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి చేపట్టిన చర్యలు, కరువు నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్లు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుత నీటి ఎద్దటి నేపథ్యంలో వరి వేయవద్దని, దీనికి ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలని వ్యవసాయ, నీటిపారుదల శాఖలను ఆదేశించారు. గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సాగు ప్రణాళికలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకొని, కరువు పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలిచే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 

వ్యవసాయ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులపై రైతులు, సాధారణ ప్రజానీకాన్ని చైతన్య పర్చాలని అన్నారు. మండలాల్లో భూ గర్భ జలాల మట్టం, వేసవి తీవ్రత తదితర అంశాలపై గణాంకాలను ప్రతీ వారం నివేదికలను  జిల్లాల్లో విడుదల చేయాలని సూచించారు.  రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ప్రజలకు అవసరమైన సమాచారం చేరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు, నీటి సంరక్షణ చర్యలు, వ్యవసాయ సలహాలు, అందుబాటులో ఉండే సహాయ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. 

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ల కు అత్యవసర ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు. ప్రస్తుత ఎల్-నినో, కరువు పరిస్థితులతో రాష్ట్రంలో దాదాపు రూ. 7,000 కోట్లతో కరువు పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు తాగునీరు, రైతులకు అవసరమైన సహాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణను సిద్ధం చేసి, దాని అమలుపై నిరంతరం దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, జిల్లాల్లో రోజు రోజుకు చెరువుల్లో నీరు గణనీయంగా తగ్గిపోతుందని తద్వారా చేపల మనుగడకు కష్టంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద రిజర్వాయర్లలో చేపలను వదిలేందుకు ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. పశువులకు తాగునీటి తొట్టెలను ప్రతీ గ్రామంలో  ఏర్పాటు చేయాలని తెలిపారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రతీ జిల్లా కలెక్టర్ కు అత్యవసర నిధుల కింద ఒక కోటి రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. వర్షాపాతం తక్కువగా నమోదు, పంట విస్తీర్ణం 50 శాతం కంటే తక్కువగా ఉండడం తదితర  ప్రమాణాలను పరిగణనలో తీసుకొని 358 మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్దారించమని తెలిపారు. నియమిత గడువైన,  ఈనెల 31 తేదీ లోగా కేంద్ర ప్రభుత్వానికి కరువు మండలాల జాబితా ను సమర్పిస్తామని తెలిపారు. 

మొత్తం 33 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో కనిష్ట వర్షపాతం నమోదుకాగా, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందని  తెలిపారు. 324 మండలాల్లో భూగర్భ జలాల మట్టం ఆందోళనకర స్థాయిలో ఉందని వివరించారు. రాష్ట్రం లోని రిజర్వాయర్లలో మొత్తం 470 టీ.ఎం.సి లకు గాను ప్రస్తుతం 170 టి. ఎం.సి ల జలాలు మాత్రమే ఉన్నాయన్నారు. సింగూరు జలాశయాన్ని తానూ స్వయంగా పరిశీలించామని, ఈ జలాశయంలో నీటి లేమితో ఏర్పడ్డ పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించామన్నారు.

ఇదీ చదవండి: సాగునీరు దేవుడెరుగు.. తాగునీరే కష్టం: సీఎం రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement