ఎన్‌ఎస్‌జీ సేవలు స్ఫూర్తిదాయకం

Governor Tamilisai Inaugurated The Black Cat Rally - Sakshi

బ్లాక్‌క్యాట్‌ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై

ఖైరతాబాద్‌: డెబ్బైఐదేళ్ల భారత స్వాతంత్య్రోత్సవాల వేళ మాతృభూమిపై యువతలో ప్రేమను పెంచడమే లక్ష్యంగా నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడి నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో సుదర్శన్‌ భారత్‌ పరిక్రమ కార్యక్రమాన్ని చేపట్టారు.

అక్టోబర్‌ 2న విశాఖ నుంచి 47 మంది బ్లాక్‌క్యాట్‌ కమోండోలు 15 కార్లలో ర్యాలీగా బయలుదేరి ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ బ్లాక్‌క్యాట్‌ కారుర్యాలీని గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ ఎన్‌ఎస్‌జీ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిందని కొనియాడారు. బ్లాక్‌క్యాట్‌ ర్యాలీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ ర్యాలీ 12 రాష్ట్రాల్లోని 18 నగరాల మీదుగా 7,500 కిలోమీటర్ల మేర కొనసాగి ఈ నెల 30న ఢిల్లీలోని జాతీయ పోలీస్‌ స్మారకచిహ్నం వద్ద ముగుస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓగ్గుడోలు, కర్రసాము, కత్తిసాము వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో నగర పోలీస్‌ కమీషనర్‌ అంజనీకుమార్, నేషనల్‌ సెక్యురిటీ గార్డ్స్‌ అధికారి షాలిన్, సీఆర్‌పీఎఫ్‌ హైదరాబాద్‌ గ్రూప్‌ డీఐజీ ప్రీత్‌ మోహన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top