
టన్నుకు రూ. 225 చొప్పున ఇచ్చే ఆలోచన
సాగు ప్రోత్సాహకానికి ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరుకు పంటకూ బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. టన్నుకు రూ.500 వరకు ఇవ్వాలని కేన్ కమిషనరేట్ నుంచి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు సమాచారం. అయితే టన్నుకు రూ.225 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు కేన్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను ప్రోత్సహించడంతోపాటు, చక్కెర పరిశ్రమలు, చెరుకు ఆధారిత పరిశ్రమలకు సైతం ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
సాగు పెరిగితే సర్కారుకు భారీగా ఆదాయమే..
రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం పెరిగితే సర్కారుకు ఆదాయం పెరుగుతుంది. ఎకరం సాగైతే సర్కారు ఖజానాకు సుమారు రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తుందని సంబంధిత పరిశ్రమల వర్గాలు లెక్కగట్టాయి. చెరుకు నుంచి చక్కెరతోపాటు ఉప ఉత్పత్తులు వస్తాయి. లిక్కర్ తయారీకి అవసరమైన మొలాసిస్ (రెక్టిఫైడ్ స్పిరిట్), ఇథనాల్ (గ్రీన్ ఫ్యూయల్) తయారీకి చెరుకే మూలాధారం. చక్కెరతోపాటు, ఈ ఉప ఉత్పత్తులపై సర్కారుకు భారీగా పన్ను రాబడి ఉంటుంది.
సాంగ్లీని సందర్శించిన ప్రజాప్రతినిధుల బృందం
మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న నిజాం–దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధుల బృందాలు ఇటీవల మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో ఉన్న చక్కెర కర్మాగారాలను సందర్శించింది. అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం చెరుకు పంటకు బోనస్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే బహిరంగసభ ఏర్పాటు చేసి ఈ బోనస్ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల అన్ని జిల్లాలకు చెందిన సీడీసీ (కేన్ డెవలప్‌మెంట్ కమిటీ) చైర్మన్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు.
ఏటా పడిపోతున్న విస్తీర్ణం
రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతోంది. ఒకప్పుడు ఐదు లక్షల ఎకరాల వరకు ఉండే ఈ పంట విస్తీర్ణం ఇప్పుడు 82 వేల ఎకరాలకే పరిమితమైంది. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 28 వేల ఎకరాలు సాగవుతుండగా, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబూబ్‌నగర్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడా చెరుకు సాగవుతోంది.
మూతపడుతున్న పరిశ్రమలు..
చెరుకు సాగు విస్తీర్ణం పడిపోవడంతో చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఉన్న ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత ఏడాదే మూతపడిన విషయం విదితమే. ప్రస్తుతం కేవలం ప్రైవేట్ రంగంలోని చక్కెర కర్మాగారాలే పనిచేస్తున్నాయి. చెరుకు సాగువిస్తీర్ణం ఇలాగే తగ్గుతూ పోతే కర్మాగారాలు ఒక్కొక్కటిగా మూతపడే అవకాశాలున్నాయి. దీంతో బోనస్ ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా ఈ పరిశ్రమలకు ఊతమిచ్చినట్టు కూడా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.