గోదావరి మళ్లీ ఉగ్రరూపం | Sakshi
Sakshi News home page

గోదావరి మళ్లీ ఉగ్రరూపం

Published Tue, Sep 13 2022 2:15 AM

Godavari River: Water Level Reached 52. 6 Feet At Bhadrachalam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/భద్రాచలం/కాళేశ్వరం/బాల్కొండ/దోమలపెంట(అచ్చంపేట): గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ఉప నదులై న మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగుతున్నాయి. దీంతో గోదావరిలో వరద ఉదృతి పెరుగుతోంది. గోదావరిపై జైక్వాడ్‌ నుంచి బాబ్లీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం, ఈ వరదకు మంజీర తోడవడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది.

వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తోంది. అలా దిగువకు వస్తు న్న వరద కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డకు.. అక్కడి నుంచి తుపాకులగూడెం బ్యారేజీలలోకి.. అక్కడి నుంచి సీతమ్మసాగర్‌లోకి వస్తోంది. అక్కడి నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరికి 10,36,818 క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి మట్టం 45.6 అడుగులకు చేరింది.  


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పూస్కుపల్లి గ్రామంలో నీట మునిగిన పత్తిచేను 

అప్రమత్తంగా ఉండాలి... 
గోదావరి ఉధృతితో ప్రభుత్వం పరీవాహక జిల్లాల కలెక్టర్‌లను అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు సహా ఇతర అధికారులను సన్నద్ధంగా ఉంచాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తక్షణమే సెక్రటేరియట్‌లో కంట్రో ల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. భద్రాచలం నుంచి పోలవరానికి వచ్చిన వరదను వచ్చినట్టుగా వదిలేస్తుండటంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,08,251 క్యూ సెక్కులు చేరుతుండగా, 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు గోదావరికి వరద కొనసాగనుంది. కాగా, ముంపు ప్రాంత ప్రజలు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలంలో అధికారులతో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదతో తీవ్ర ఇబ్బందులు పడిన భద్రాచలం ఏజెన్సీ ప్రజలు, రైతులు.. మరోమారు ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మహదేవపూర్‌ మండలం అన్నారం, చండుప్రల్లి, నాగేపల్లి, పూస్కుపల్లి, కాళేశ్వరం గ్రామాల్లోని గోదావరి పరీవాహక పంటభూములు నీటమునిగాయి. 

శ్రీశైలంలో తొమ్మిది గేట్లు ఎత్తివేత 
శ్రీశైలం ఆనకట్ట వద్ద సోమవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువన సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల  నుంచి 2,69,207 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో 3,02,630 క్యూసెక్కుల నీటిని నాగర్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement