ముందస్తు దెబ్బ.. అభివృద్ధి పనులపై అయోమయం!

GHMC Council Meeting Cancelled Effect On Development Programs - Sakshi

గ్రేటర్‌లో రూ. వందల కోట్ల పనులపై సందిగ్ధత

ఆమోదించాల్సిన పాలకమండలి సమావేశం రద్దు

కొత్త పాలకమండలి వచ్చాకే తిరిగి సభ ముందుకు 

సాక్షి, సిటీబ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా బల్దియా పాలక మండలి ఎన్నికలు ముందస్తుగా నిర్వహించడంతో పలు అంశాల్లో అయోమయం నెలకొంటోంది. రెండు నెలల కంటే ముందుగానే కొత్త కార్పొరేటర్ల ఎన్నిక జరిగినప్పటికీ, కొత్త సభ కొలువుదీరలేదు. దీంతో పది నెలలుగా పాలకమండలి సర్వసభ్య సమావేశం జరగలేదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న.. ఇప్పటికే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన 68 పనులపై సందిగ్ధత నెలకొంది. వాస్తవంగా ఈ పనుల ఆమోదం కోసం బుధవారం సభ నిర్వహించాలనుకున్నారు. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సభ వాయిదా పడింది. సభ జరిగితే..గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతిపక్షమంటూ లేకపోవడంతో స్వల్ప వ్యవధిలో సభ ముగిసేది. సభాధ్యక్షుడైన మేయర్‌ ఒక్కమాటతో అన్ని అంశాలు ఆమోదం పొందేవి. సభ జరగకపోవడంతో ఇక కొత్త పాలకమండలి కొలువుదీరాకే వీటికి ఆమోదం లభించనుంది.  (చదవండి: జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు)

అంత ఈజీ కాదు... 
మేయర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థే గెలిచే అవకాశాలుండటం..అన్నిఅంశాలూ ఆమోదం పొందడమూ సాధ్యమే అయినప్పటికీ, ఇదివరకులా ఈజీగా మాత్రం సభ జరిగే అవకాశాల్లేవు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షం లేదు. టీఆర్‌ఎస్‌ సభ్యులు 99 మంది, ఎంఐఎం సభ్యులు 44 మంది ఏకాభిప్రాయంతోనే ఉండేవారు. హాజరయ్యే ఎక్స్‌అఫీషియోలు సైతం అనుకూలంగానే వ్యవహరించేవారు. బీజేపీ సభ్యులు కేవలం నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు  ఉండేవారు.  

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ సభ్యులు 56కు తగ్గడం.. బీజేపీ బలం ఏకంగా 48కి పెరగడం తెలిసిందే. రెండు పార్టీలూ ప్రతి విషయంలో వాదోపవాదాలు, విమర్శలకు దిగుతున్న ప్రస్తుత తరుణంలో బల్దియా సమావేశాల్లోనూ అది ప్రతిబింబించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. అజెండాలోని అంశాలతోపాటు అప్పటికప్పుడు టేబుల్‌ అజెండాగానూ పలు అంశాలను సభ ముందుంచి, వెనువెంటనే ఆమోదించిన ఆనవాయితీ కూడా ఉంది. అలాంటిది కూడా ఇకపై జరగబోయే సమావేశాల్లో కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆమోదం పొందాల్సిన అజెండాలోని కొన్ని ముఖ్యాంశాలు.. 

  • బీఓటీ పద్ధతిలో 201 బస్‌షెల్టర్ల నిర్మాణం. 
  • సికింద్రాబాద్, కూకట్‌పల్లి, చారి్మనార్, శేరిలింగంపల్లి జోన్లలో రోడ్లపై గుంతల పూడ్చివేసే యంత్రాలకు ఏడాదికి రూ.15.39 కోట్ల అద్దె. 
  • హస్తినాపురం శివసాయికాలనీలో చంద్రా గార్డెన్‌ దగ్గర రూ.3.55 కోట్లతో బాక్స్‌ డ్రెయిన్, గాయత్రినగర్‌లో రూ.5.25 కోట్లతో బాక్స్‌డ్రెయిన్‌. 
  • సంతోష్‌నగర్‌ సర్కిల్‌లోని రెడ్డికాలనీ నుంచి సింగరేణి కాలనీ చౌరస్తా వరకు రూ.5.99 కోట్లతో వరద కాలువ నిర్మాణం.  
  • పలు థీమ్‌పార్కుల స్థలాల మార్పు. 
  • క్యూ సిటీ నుంచి ఎన్‌ఐఏబీ వరకు స్లిప్‌రోడ్‌ నిర్మాణం. 
  • మీరాలంచెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.9.50 కోట్లు. 
  • లాలాపేటలో రూ.6.9 కోట్లతో మలీ్టపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం.  
  • రామచంద్రాపురం సర్కిల్‌లోని మన్మోల్‌ గ్రామంలోని సర్వేనెంబర్లు 475 నుంచి 482 వరకు   జీహెచ్‌ఎంసీ పరిధినుంచి తొలగించి తెల్లాపూర్‌ మునిసిపాలిటీలో కలపడం. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top