
శస్త్రచికిత్సలతో పోలిస్తే అనేక ప్రయోజనాలు
మెదడులో వచ్చే సమస్యలు.. ప్రధానంగా క్యాన్సర్ మెటాస్టాటిస్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్రయోజనకరం. ఇందులో రేడియేషన్ కిరణాలను కేంద్రీకరించి పంపుతారు. మొత్తం 192 గామా కిరణాలను మెదడులో ఒకేచోటుకు పంపుతారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతం మీద అధికమోతాదులో రేడియేషన్ అందుతుంది. చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్యంత కచ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు.
చికిత్సకు ముందు రోగి తల కదలకుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడతారు. గామా కిరణాలు సరిగ్గా ఎక్కడ పడాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స సమయంలో రోగి మెలకువగానే ఉంటారు. ఇందులో కోత ఉండదు కాబట్టి రక్తం పోదు, ఇన్ఫెక్షన్లు రావు, జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. మెదడులో వచ్చే కణితులు (క్యాన్సర్, ఇతరాలు), రక్తనాళాలు సరిగా ఏర్పడకపోవడం, పిట్యుటరీ కణితులు, విపరీతమైన నొప్పి తదితరాలకు ఇది బాగా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, పనులు చేసుకోవచ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స. దుష్ప్రభావాలు చాలా తక్కువ, విజయాల రేటు ఎక్కువ.
రోగులకు ప్రయోజనాలివీ..
మెదడు శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా.. కోత, నొప్పి లేని పద్ధతిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివల్ల రోగులకు సమస్యలుండవు, వేగంగా కోలుకుంటారు. మెదడులో ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలను పాడుచేయకుండా సమస్యను మాత్రమే కచ్చితంగా తొలగిస్తుంది. చాలావరకు ఒకే సెషన్‌లో అయిపోతుంది. రోగులు అదేరోజు ఇంటికి వెళ్లచ్చు. ఇప్పటివరకు గామా నైఫ్ చికిత్సలు ప్రపంచంలో 10 లక్షల మందికి పైగా రోగులు పొందారు. మన దేశంలో ఇప్పటివరకు 8వేల ప్రొసీజర్లు చేశారు. కొన్నిరకాల మెదడు కణితులకు, న్యూరాల్జియా లాంటి సమస్యలకు ఇది 90% విజయాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారు.
దీనికి సగటున 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుతుంది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం 24-48 గంటల్లోనే 90% రోగులు తమ పనులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ కణితులు, రక్తనాళాల్లో సమస్యలు.. లాంటి 20 రకాల సమస్యలకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. కిమ్స్ ఆస్పత్రిలో పెట్టినది ఒకే సెషన్‌లో పలు కణితులను కూడా నయం చేస్తుంది. దాంతో చికిత్స సమయం తగ్గుతుంది. న్యూరాల్జియా సమస్యకు దీంతో చికిత్స చేస్తే 48 గంటల్లోనే నొప్పి బాగా తగ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్రమే కొన్ని ప్రభావాలు కనిపిస్తాయి. సంప్రదాయ మెదడు శస్త్రచికిత్సల కంటే ఇందులో దుష్ప్రభావాలు దాదాపు లేనట్లే.