పొలం ఎండి.. గుండె మండి | Farmers abandoning crops as fodder for livestock due to lack of irrigation water | Sakshi
Sakshi News home page

పొలం ఎండి.. గుండె మండి

Mar 6 2025 3:31 AM | Updated on Mar 6 2025 4:23 AM

Farmers abandoning crops as fodder for livestock due to lack of irrigation water

సాగునీరు లేక పశువులకు మేతగా పంటలను వదిలేస్తున్న రైతన్నలు

గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీటికి తీవ్ర సమస్య 

కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకు కనిపించని నీటి జాడ.... ఎల్లంపల్లి జలాలు హైదరాబాద్‌ తాగునీటికే సరిపోని పరిస్థితి 

ఎస్సారెస్పీ, లోయర్‌ మానేరు నీటితో కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో కొంతమేర మాత్రమే సరఫరా  

ఎండిపోతున్న సూర్యాపేట.. దేవాదుల నీరు రాక జనగాంలో కరువు పరిస్థితి 

కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోనూ నీటి కష్టాలు 

నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో చివరి ఆయకట్టుకు అందని సాగునీరు 

రాష్ట్రవ్యాప్తంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు.. ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

వరి పంటంతా పశువుల పాలు.. 
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన రైతు గుండె మైసాలు ఎకరం వేరుశనగ, మరో ఎకరం వరిసాగు చేశారు. ఆరు తడి పంట కావడంతో వేరుశనగ చేతికి వచ్చింది. కానీ బావిలో నీళ్లు అడుగంటి సాగునీరు లేక వరి ఎండిపోయింది. దీనితో దిక్కుతోచని మైసాలు.. పొలాన్ని వదిలేయగా బుధవారం పశువులు, గొర్రెల మందలు మేస్తున్నాయి. పంట పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.     
– మరిపెడ రూరల్‌

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో పంటలకు కష్టకాలం వచ్చింది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగుచేసిన వరి, మొక్క జొన్న తదితర పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. గోదావరి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో అధికార యంత్రాంగంలో అయోమయం నెలకొంటే... కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో పంటలకు సరిపడా నీళ్లు లేక బిక్కమొహం వేసే పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే వానలు మెరుగ్గానే ఉన్నా, పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలున్నా కూడా పంటలకు అందడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతుండటంతో పశువుల మేత కోసం వదిలేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. 

కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవడంతో.. 
గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను నిలిపివేయడంతో.. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీళ్లు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి. దీనితో మిడ్‌ మానేరులో ఉన్న నీటిని అవసరానికి అనుగుణంగా లోయర్‌ మానేర్, మల్లన్నసాగర్‌కు వదులుతున్నారు. మల్లన్నసాగర్‌లోని నిల్వలు మరో 20 రోజులకు   మించి సాగునీటి అవసరాలు తీర్చలేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లోని చెరువుల్లో నిల్వ ఉన్న నీళ్లు కూడా కనీసం 20రోజుల పాటు అయినా పంటలకు అందే స్థాయిలో లేవు. 

రాష్ట్రంలో ఎల్లంపల్లి దిగువన ఉన్న మిడ్‌మానేరును ఆనుకొని ఉన్న సిరిసిల్ల జిల్లా తీవ్రమైన సాగునీటి కష్టాలను ఎదుర్కుంటోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి లోయర్‌ మానేరు, వరంగల్‌ మీదుగా సూర్యాపేట వరకు సాగునీటిని ‘వార బందీ (వారానికి ఒకసారి మాత్రమే సాగునీటిని వదలడం)’ కింద ఇస్తుండటంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా ఎస్సారెస్పీ నీటి విడుదలను వారబందీ పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. 

⇒ మరోవైపు దేవాదుల నుంచి జనగామ జిల్లాలోని చెరువులకు ఇటీవలే సాగునీటిని వదిలినా.. ఆ నీటితో చెరువులు నింపేలోపు పొలాలన్నీ ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

⇒ మెదక్‌ జిల్లాలోని పొలాలకు నీళ్లు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులు లేవు. దీనితో 95శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. 

⇒ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి సహా చాలా జిల్లాల్లో సాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. 

కృష్ణా నది పరిధిలోనూ అదే పరిస్థితి.. 
దక్షిణ తెలంగాణలో కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టుల కింద పరిస్థితి విభిన్నంగా ఉంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో చివరి ఆయకట్టుకు, మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేక, భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. 

గద్వాల ప్రాజెక్టు పరిధిలోని పొలాలకు సాగునీటితోపాటు భూగర్బ జలాలు కొంత ఆశాజనకంగా ఉన్నా... కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ల కింద పొలాలకు నీరు అందడం లేదు. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో సాగయ్యే వేరుశనగకు వారానికో తడి నీరు కూడా లేక, భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. 

బాగా పెరిగిన వరి సాగుతో.. 
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. యాసంగి సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో 69.22 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టారు. ఇందులో 53.24 లక్షల ఎకరాలు వరి పంటే. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు అధికం కూడా. వరి తర్వాత మొక్కజొన్న 7.50 లక్షల ఎకరాల్లో సాగయింది. 

మహబూబ్‌నగర్, వికారాబాద్, నిజామాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కలిపి 2.35లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. రెండేసి లక్షల ఎకరాల్లో కందులు, జొన్నలు సాగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తుండటంతో ఈ సారి వరిసాగు భారీగా పెరిగింది. అయితే వరి సాగుకు నీటి వినియోగం ఎక్కువ. 

అందులోనూ వరి పొట్టకొచ్చే సమయంలో నీళ్లు కీలకం. ఇలాంటి సమయంలో సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కింద కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాలకు నీళ్లు అందుతుండగా.. అక్కడ కూడా వారబందీ విధానం పెట్టే ఆలోచనలో నీటిపారుదల శాఖ ఉంది. 

ఎస్సారెస్పీ నీటితో రెండుమూడేళ్లుగా యాసంగిలో సూర్యాపేట పొలాలకు నీరు అందగా.. ఈసారి ఎస్సారెస్పీ నీరు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సాగునీటి సమస్యతో చాలా పొలాలు ఎండిపోయాయని, వాటిలో పశువులను మేపుతున్నామని రైతులు వాపోతున్నారు. 

మొక్కజొన్న, వేరుశనగకు కూడా సమస్య.. 
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాగైన మొక్కజొన్న, వేరుశనగ పంటలకు వారానికోసారి కూడా సాగునీళ్లు అందని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మహబూబ్‌నగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో వేరుశనగ.. మెదక్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్న పంట ఎండిపోతోంది. నీటి విడుదల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు అంటున్నారు.  

జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన రైతు ఉప్పుల శ్రీను రెండెకరాల్లో వరి సాగు చేశారు. ఆయన తన పొలంలోని బోరు ఆధారంగానే ఏటా రెండు పంటలు సాగు చేసేవారు. కానీ బోరు ఎండిపోవడంతోపాటు చెరువుల్లోకి దేవాదుల రిజర్వాయర్‌ నీరు కూడా రాలేదు. దీనితో వరి ఎండిపోయింది. పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో పొలాన్ని మూగజీవాలకు వదిలేశారు. 


ఈ చిత్రంలోని వ్యక్తి మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన బర్తపురం కొమిరెల్లి. ఆకేరు వాగు పక్కనే ఉన్న రెండున్నర ఎకరాల్లో యాసంగి వరిసాగు చేశారు. గతేడాది భారీ వర్షాలతో చెక్‌డ్యామ్‌ కొట్టుకుపోవడంతో నీటి నిల్వ తగ్గింది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. దీనితో పదిహేను రోజులుగా పొలానికి నీళ్లు లేక నెర్రెలు బారింది. లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు పశువులను మేపడానికి తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కొమిరెల్లి కన్నీరు పెడుతున్నారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 

12 ఎకరాల పొలం ఎండిపోతోంది 
గోదావరి నీళ్ల మీద ఆశతో 12 ఎకరాల్లో వరి వేసిన. ఈసారి నీళ్లు తక్కువ వచ్చాయని పొలాలకు సరిగా వదలలేదు. వారబందీ పేరుతో రావలసిన నీళ్లను కూడా మూడు రోజులుగా ఇవ్వడం లేదు. రూ.మూడు లక్షలకుపైగా పెట్టుబడి పెట్టా. నీళ్లు సక్రమంగా విడుదల చేయక పంట ఎండిపోతోంది. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నీళ్లు బాగుంటే మరో 45 రోజుల్లో పంట చేతికి వచ్చేది. ఇట్లాగయితే ఎలా?  
– సుంకరి వెంకన్న, రైతు, సీతారాంపురం, జాజిరెడ్డిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement