దంపతుల బలవన్మరణం
చైతన్యపురిలో మిస్సింగ్ కేసు...
నాగోలు పరిధిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తింపు
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు తనువు చాలించారు. వాకింగ్‌కు అని వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన గడ్డమిడి మల్లేష్ (45), సంతోషి (37) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్వగ్రామంలోని రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు అమ్మి బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్ నంబర్–4లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు.
కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా పెద్దకూతురు మేఘన ఇంటర్, చిన్నకూతురు మౌనిక టెన్త్ క్లాస్ చదువుతుంది. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రోజు మాదిరిగానే మార్నింగ్ వాకింగ్‌కని బయటకు వెళ్లారు. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో 7.30 గంటలకు కుమారుడు శివ తండ్రి సెల్ ఫోన్ నంబర్‌కు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత తండ్రి మల్లేష్ సెల్‌ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. ‘నాకు రూ.20 లక్షలు, మీ అమ్మకు రూ.20 లక్షలు ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి వస్తాయి’ అని మెసేజ్‌లో ఉంది. తరువాత ఫోన్ స్విచాఫ్ చేసి వుంది. దీంతో ఆందోళన పడ్డ శివ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
నాగోలులో గుర్తింపు...
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మల్లేష్, సంతోషి దంపతుల జాడ వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జీపీఆర్‌ఎస్ ద్వారా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటి లొకేషన్ ఆధారంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. 100 ఫీట్ల రోడ్డు పక్రన నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చూడగా మల్లేష్, సంతోషి అపస్మారక స్థితిలో ఉన్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరీక్షించగా సంతోషి అప్పటికే మృతిచెంది వున్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న మల్లేష్‌ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కొద్దిసేపటికే మల్లేష్ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


