ఈడబ్ల్యూఎస్‌ కోటా..203 ఎంబీబీఎస్‌ సీట్లు..

EWS 203 MBBS Seats For The 2021 22 Year In Telangana - Sakshi

ఏడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కేటాయింపు.. ఆలిండియా కోటాలోకి 230 ఎంబీబీఎస్‌ సీట్లు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2021–22 వైద్య విద్య సంవత్సరానికి గాను ఆర్థికపరంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 203 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్‌ రిమ్స్, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్‌ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీల్లో 13 సీట్లు మంజూరైనట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే వీటిలో 102 సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అర్హులైన వారితో భర్తీ చేస్తామని, మిగిలిన 101 సీట్లలో 30 ఎస్సీ విద్యార్థులకు, 59 బీసీ, 12 ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి ఈడబ్ల్యూఎస్‌ సీట్లను మంజూరు చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అఖిల భారత కోటాలోకి 230 సీట్లు..
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,285 కన్వీనర్‌ కోటా సీట్లుండగా, వీటిలో 15 శాతం సీట్లను అంటే సుమారు 230 సీట్లను అఖిల భారత కోటాలోకి ఇవ్వనున్నారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 30 చొప్పున, ఉస్మానియాలో 37, రిమ్స్‌ ఆదిలాబాద్, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఈఎస్‌ఐ కాలేజీలో 15 చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 22 సీట్ల చొప్పున కేటాయించారు. అఖిల భారత కౌన్సెలింగ్‌ సందర్భంగా ఈ ఎంబీబీఎస్‌ సీట్లను నింపుతారు. వీటికి దేశవ్యాప్త విద్యార్థులు పోటీ పడతారు. రెండు కౌన్సెలింగ్‌లలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. అయినా సీట్లు మిగిలిపోతే, వాటిని తిరిగి రాష్ట్రంలో జరిగే కౌన్సెలింగ్‌లో భర్తీ చేసుకునే అవకాశం ఇస్తారు. కాగా, రెండ్రోజుల కింద నీట్‌ ఫలితాలు వచ్చాయి. అయితే రాష్ట్రాల వారీగా ఇంకా ర్యాంకులు ప్రకటించలేదు. త్వరలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి రాష్ట్రానికి చెందిన అర్హులైన విద్యార్థుల జాబితా వస్తుందని, అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంకులు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top