
ఇంగ్లిష్ చదివినవారుఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు
తెలుగు అమ్మభాష అయితే.. నడిపించే నాన్న భాష ఇంగ్లిష్
ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్ నూ బోధించాలి
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: ‘విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్ ను కూడా బోధించాలి’అని ప్రముఖ సినీ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలుగు వన్’యూట్యూబ్ చానల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలి అన్న ఆలోచనతో తెలుగు వన్‌ను స్థాపించిన రవిశంకర్‌కు అభినందనలు. ఈ చానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు.
నేను తెలుగువాణ్ణి అంటూ తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. మనం తెలుగువాళ్లమే. మన మాతృభాష తెలుగు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఉద్యోగాలు కావాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ కావాలి.. ఇంగ్లిష్ రావాలి. అమ్మ భాష మాతృ భాష తెలుగు అయితే, నడిపించే నాన్న భాష ఇంగ్లిష్. మేము పేదవాళ్లం. అందరికీ న్యూటన్ లాగానో, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగానో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. అందరూ చదువుకోవాలి.
మా ఊర్లో బీఏ చదివిన మొదటి వ్యక్తిని నేను. ఆ రోజుల్లో నాలాంటి పేదవాళ్లందరికీ ఇంగ్లిష్ రాక ఫెయిల్ అయ్యాం. ప్రాథమికస్థాయి నుంచి మాకు ఎప్పుడూ ఇంగ్లిష్ లేదు. మేం బీఏ, ఎంఏ, ఎంకామ్.. ఇలా అన్నీ పాస్ అయ్యాం. ఉద్యోగాల కోసం పరీక్ష రాసేందుకు వెళితే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ లో ప్రశ్న పత్రాలు ఉండటం వల్ల మాకు అర్థం కాక ఫెయిల్ అయ్యాం. దీంతో గుమస్తాలు అయ్యాం.. ప్యూన్‌లు అయ్యాం.. అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వ¿ౌమాధికారాన్ని కాపాడే జవాన్‌లు అయ్యాం.
ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసులం అయ్యాం. కానీ ఇంగ్లిష్ మీడియం వచ్చిన వారు ఏమయ్యారు? కలెక్టర్లు, ఇంజినీర్లు, డాక్లర్లు అయ్యారు.. చాలా సంతోషంగా ఉంది. కానీ, విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్‌గారు చెప్పారో.. తెలుగు, ఇంగ్లిష్ అనే భేదం వల్ల ఇంగ్లిష్ వచ్చినవాళ్లు చాలా గొప్పవాళ్లు అయిపోయారు. తెలుగు వచి్చనవారు అథఃపాతాళానికి వెళ్లారు. అది కాకుండా ఉండాలంటే.. విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతో పాటు ఇంగ్లిష్ ని కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను’అని నారాయణమూర్తి తెలిపారు.