
కన్వీనర్ కోటా కింద తాజాగా పెరిగిన 5,549 సీట్లు
తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మిగిలిన 13,944 సీట్లు
రెండో విడతకు అందుబాటులో మొత్తం 19,493 కంప్యూటర్ బ్రాంచీల సీట్లు
6 వేలకు పైన ర్యాంకు వచ్చినా సీటు వస్తుందనే అంచనా
ఆయా బ్రాంచీల్లో సీటు కోసం భారీయెత్తున విద్యార్థుల ఆప్షన్లు
95 వేల మంది విద్యార్థులు... అన్నీ కలిపి 27 లక్షల ఆప్షన్లు
30న ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరగడంతో రెండోదశ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఆ బ్రాంచిపై విద్యార్థుల ఆశలు పెరిగాయి. ఈసారి కంప్యూటర్ సీటు వస్తుందని భావిస్తున్నారు. తొలివిడతలో ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్లూ ఆప్షన్లు మార్చుకున్నారు. తొలి ప్రాధాన్యతగా సీఎస్‌ఈ, ఎమర్జింగ్ కోర్సులను ఎంచుకున్నారు. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారం ముగిసేనాటికి 95 వేల మంది 27 లక్షల ఆప్షన్లు ఇచ్చినట్టు ఎప్‌సెట్ క్యాంప్ కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 30న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
పెరిగిన సీట్లన్నీ ప్రైవేటు కాలేజీల్లోనే..
తొలిదశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద కంప్యూటర్ సైన్స్, ఇతర ఎమర్జింగ్ బ్రాంచీల్లో 58,742 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 57,042 సీట్లు కేటాయించారు. అయితే 44,798 మంది మాత్రమే రిపోర్టు చేశారు. దీంతో 13,944 సీట్లు మిగిలిపోయాయి. తాజాగా కన్వీనర్ కోటా కింద కంప్యూటర్ సైన్స్ సీట్లు 5,549 పెరిగాయి. దీంతో మొత్తం 19,493 కంప్యూటర్ సంబంధిత బ్రాంచీల సీట్లు రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వస్తాయి. పెరిగిన సీట్లన్నీ ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి.
టాప్ కాలేజీల్లో తొలి దశ కేటాయింపులో గరిష్టంగా 5 వేల ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. రెండోదశలో 6 వేలపైన ర్యాంకుకు కూడా సీటు రావచ్చని ఎప్‌సెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 25 వేల ర్యాంకు వరకూ టాప్ కాలేజీల్లో సీట్లు వస్తాయని చెబుతున్నారు.
భారీగా కాలేజీలు, ఆప్షన్ల మార్పు
సివిల్, ఈఈఈ, మెకానికల్ వంటి కోర్ గ్రూపుల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో కాలేజీల మార్పుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పుడు వచ్చిన కాలేజీ కన్నా, బెస్ట్ కాలేజీలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో 78 శాతం విద్యార్థులు బ్రాంచీ మార్పుకు ఆప్షన్లు ఇచ్చారు. సివిల్‌లో సీటు వచ్చిన విద్యార్థులు టాప్ 30 కాలేజీల్లోనైనా కంప్యూటర్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో సీటు వస్తుందేమోనన్న ఆశతో ఆప్షన్లు ఇచ్చారు.
మరోవైపు టాప్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఆప్షన్లలో కాలేజీ మార్చుకున్నారు. అయితే ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌ల్లో కంప్యూటర్ సీట్లు వచ్చిన విద్యార్థులు మాత్రం ఆప్షన్లు పెద్దగా మార్చుకోలేదు. అయితే వర్సిటీల్లో సివిల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల్లో సీట్లు వచ్చిన చాలామంది ప్రైవేటు కాలేజీల్లో ఎమర్జింగ్ గ్రూపుల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చారు.
కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా కలిపి మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి 1,07,444 సీట్లు ఉంటే, రెండో విడత నాటికి కంప్యూటర్ బ్రాంచీలతో పాటు కోర్ గ్రూపుల్లో పెరిగిన 9,433 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్‌లో మొత్తం 1,16,877 సీట్లు ఉన్నట్టయింది.