పదివేలలోపు ర్యాంకుంటే.. టాప్‌ కాలేజీల్లో సీటు! | Engineering counselling starts tomorrow | Sakshi
Sakshi News home page

పదివేలలోపు ర్యాంకుంటే.. టాప్‌ కాలేజీల్లో సీటు!

Jun 18 2026 3:08 AM | Updated on Jun 18 2026 3:08 AM

Engineering counselling starts tomorrow

టాప్‌ కాలేజీల్లో అడ్మిషన్‌కు కసరత్తు కీలకం

ఆప్షన్లు ఇచ్చేటప్పుడు మేధోమథనం ముఖ్యం

గతేడాది కటాఫ్‌పై గురి పెడితే మేలు.. రేపట్నుంచే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 19 నుంచి మొదలవుతుంది. ఇదే రోజు నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 25 నుంచి జూలై 1 వరకూ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మాక్‌ సీట్ల కేటాయింపు జూలై 4న ఉంటుంది. వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవడానికి జూలై 5 నుంచి 7 వరకూ గడువు ఇచ్చారు. జూలై 10న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది.

సాంకేతిక విద్య మండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 159 కాలేజీలు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల నుంచి సీట్ల వివరాలు కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌లో క్రోడీకరించారు.

ఆప్షన్‌ ఇచ్చేటప్పుడు జాగ్రత్త
»  నచ్చిన బ్రాంచీ, కాలేజీలపై విద్యార్థులు ముందుగా ఒక అవగాహనకు రావాలి. ఎప్‌సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కొంత కసరత్తు చేయాలి. వచ్చిన ర్యాంకుకు ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో అంచనాకు రావాలి. గత ఏడాది కటాఫ్‌లను విద్యార్థులు ప్రామాణికంగా తీసుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. సీటు లభ్యత ఉన్న కాలేజీల జాబితాల్లో నచ్చిన కాలేజీలను మొదటి ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ఇదేవిధంగా బ్రాంచీ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. 

బ్రాంచీ ముఖ్యం అనుకుంటే కాలేజీ ప్రాధాన్యతపై కొంత చూసీచూడనట్టు ఉండొచ్చు. కాలేజీనే ముఖ్యం అనుకుంటే బ్రాంచీ ఏదైనా ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిపై అంచనా లేకుండా ఆప్షన్లు ఇస్తే నష్టం జరిగే వీలుంది. ఉదాహరణకు 50 వేలపైన ర్యాంకు వచ్చిందనుకుందాం. ఈ ర్యాంకుతో టాప్‌ కాలేజీల్లోనే సీటు కావాలని, ఆప్షన్‌ ఇస్తే కటాఫ్‌ ప్రకారం రాకపోవచ్చు. విద్యార్థి ర్యాంకుకు తగ్గ కాలేజీలు, బ్రాంచీలకు తొలి కౌన్సెలింగ్‌లో 70 వేల ర్యాంకు వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు.

టాప్‌ కాలేజీల్లో 10 వేల లోపే
»   ఈసారి విద్యార్థుల చూపు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ మీదే కన్పిస్తోంది. గత ఏడాది 68 శాతం విద్యార్థులు సీఎస్‌ఈ, అనుబంధ ఎమర్జింగ్‌ కోర్సుల్లో చేరారు. ఈసారి ఈసీఈ, సీఎస్‌ఈ కోర్‌ గ్రూపుల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన కాలేజీల్లో గరిష్టంగా 10 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుందని అంచనాలు చెబుతున్నాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌ వంటి క్యాంపస్‌లలో సీఎస్‌ఈతోపాటు అన్ని గ్రూపులకు పోటీ తీవ్రంగానే ఉంది. 

సీఎస్‌ఈలో 2 వేల లోపు, ఈసీఈలో 5 వేల లోపు మాత్రమే సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని ఇతర జిల్లాల్లో ఉన్న కొత్త కాలేజీల్లో పోటీ పెద్దగా కన్పించడం లేదు. 90 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా యూనివర్సిటీ కాలేజీల్లోనూ డిమాండ్‌ ఉండటం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement