తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. టీఎస్‌ ఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్‌

Electricity Charges Hiked Telangana 2022 Check Full Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఖరారైంది. 14 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచేందుకు టీఎస్‌ ఈఆర్సీ Electricity Regulatory Commission గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక స్పష్టత వచ్చింది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి.

పెరిగిన ఛార్జీల ప్రకారం.. డొమెస్టిక్‌(గృహోపయోగ విద్యుత్తు వాడకం) పై 40-50 పైసలు పెంపు వర్తించనుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున భారం పెరగనుంది. అయితే గతంలోనే పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చిన డిస్కంలు.. 19 శాతం పెంపునకు అనుమతి కోరాయి. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతానికే అనుమతి ఇచ్చింది.

డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు డిసెంబర్‌ నెలలోనే నివేదికలు సమర్పించకగా..  ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు ఆ టైంలోనే అందించాయి. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా విద్యుత్‌ నియంత్రణ మండలి టీఎస్‌ ఈఆర్సీ అంగీకరించినట్లు సమాచారం.

ఏప్రిల్‌ 1 నుంచే వర్తింపు
డిస్కంల ప్రతిపాదనలతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి పెంపు నిర్ణయం తీసుకుందని ఈఆర్సీ చైర్మన్‌ టి. శ్రీరంగారావు మీడియా సమావేశంలో తెలిపారు. 2022-23 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ 16 వేల కోట్ల రూపాయలు. కానీ, 14, 237 కోట్ల రూపాయల గ్యాప్‌ను మాత్రమే కమిషన్‌ ఆమోదించింది. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి అని చైర్మన్‌ రంగారావు వెల్లడించారు.

గతంలో కంటే 38.38 శాతం అధికంగా ప్రతిపాదన వచ్చిందన్న ఆయన.. వ్యవసాయానికి విద్యుత్‌ టారిఫ్‌ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్‌ ప్రతిపాదనలు ఆమోదించలేదని, డిస్కంలు నవంబర్‌ 30లోపు ప్రతిపాదనలు కమిషన్‌ ముందు ఉంచాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top