
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక బెట్టింగ్ యాప్‌ల కోసం ప్రచారంచేసిన ఉదంతంలో మాజీ భారతీయ క్రికెటర్ సురేశ్ రైనాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ఎనిమిది గంటలపాటు విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు ఉదయం 11 గంటలకు వచ్చిన రైనా రాత్రి 8 గంటలకు వెళ్లిపోయారు. మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్‌ఏ) చట్టం కింద అధికారులు రైనా వాంగ్మూలాన్ని నమోదుచేసుకున్నారు.
క్రీడాసంబంధ బెట్టింగ్ యాప్ అయిన 1 గీట్ట కోసం రైనా ప్రమోట్‌చేశారని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. యాప్ తరఫున ఎవరు మిమ్మల్ని కలిశారు? ఎవరు మీకు ప్రమోషన్ ఫీజు చెల్లించారు? నగదు, డిజిటల్ రూపంలో ఎంత చెల్లించారు? ఏఏ రాష్ట్రాల్లో ఏ తరహా ప్రమోషన్ చేశారు? ఇది చట్టవ్యతిరేక యాప్ అని మీకు ముందే తెలుసా? అంటూ పలు రకాల ప్రశ్నలు సంధించి సమాధానాలను రాబట్టింది. బెట్టింగ్ యాప్‌ల మోసాలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటికే ఈడీ గూగుల్, మెటా ప్రతినిధులను పిలిచి ప్రశ్నించింది.
భారత్‌లో ఆన్‌లైన్‌బెట్టింగ్ యాప్‌ల మార్కెట్ విలువ ఏకంగా100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం గమనార్హం. ఇది ఏటా 30 శాతం వృద్ధితో మరింతగా విస్తరిస్తోంది. భారత్‌లో 22 కోట్ల మంది ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను వినియోగిస్తున్నారు. వారిలో సగం మంది సాధారణ యూజర్లుగా కొనసాగుతున్నారు. వందలాది ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లను మూసేయాలంటూ 2022 ఏడాది నుంచి 2025 జూన్‌దాకా 1,524 సార్లు ఉత్తర్వులు జారీచేశామని కేంద్రం ఇటీవల లోక్‌సభకు తెలిపింది.