
పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిర్వహణ
కీలక నిర్ణయం తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్
సాక్షి, హైరదాబాద్: నగరంలో డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు ఏ సమయంలో ఎక్కడెక్కడ జరుగుతుంటాయి అనేది మందుబాబులకు కొట్టిన పిండిగా మారింది. 2011 నుంచి ఈ విధానం కొనసాగిస్తుండటమే దీనికి కారణం. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లు ఆయా సమయాలు, మార్గాలను వదిలి వెళుతూ చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లే కొన్నిసార్లు ప్రమాదాలకు లోనవుతూ, కారకులుగా మారుతున్నారు.
తమ ప్రాణాలు కోల్పోవడమో, ఎదుటి వారి ప్రాణం తీయడమో చేస్తున్నారు. గత నెలలో పాఠశాల బస్సులపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించారు. అప్పట్లో బడి బస్సులు నడిపే 35 మంది డ్రైవర్లు సైతం మద్యం మత్తులో చిక్కారు. ఈ విషయాలు గమనించిన నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేయాలని ప్రతిపాదించారు. ఈ విధానానికి నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆమోదముద్ర వేయడంతో బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేపట్టారు. మైనర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే కఠిన చర్యలు తీసుకోవాలని, వారితో పాటు వాహన యజమాని, మద్యం విక్రయించిన వ్యాపారి పైనా కేసులు నమోదు చేయనున్నారు. మైనర్ డ్రైవింగ్ పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా చిక్కిన 4500 మందిపై కేసులు నమోదు చేశారు. 2800 వాహనాల రిజి్రస్టేషన్ రద్దు కోసం సిఫార్సు చేయగా... ఆర్టీఏ అధికారులు ఇప్పటికే 863 రద్దు చేసినట్లు జోయల్ డెవిస్ ప్రకటించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే వారికి 25 ఏళ్ల వచ్చే వరకు లైసెన్సు రాదని స్పష్టం చేశారు.
మింట్ కాంపౌండ్‌లో స్పెషల్ డ్రంకన్ డ్రైవ్
ఖైరతాబాద్: నగర సీపీ ఆదేశాల మేరకు పగటి పూట కూడా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డెవిస్ తెలిపారు. బుధవారం సాయంత్రం మింట్ కాంపౌండ్‌లో ఆకస్మికంగా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా షాకింగ్ కలిగించే విషయాలు బయటపడ్డాయని, ముఖ్యంగా స్కూలు బస్సు, స్కూల్‌కు ఆటోలలో పిల్లల్ని తీసుకువెళ్లే డ్రైవర్లు తాగి డ్రైవ్ చేస్తున్నారని చెప్పారు. నెల రోజుల్లో 35 కేసులు నమోదు చేశామని, ఓ స్కూల్ బస్సు డ్రైవర్‌కు 400 రీడింగ్ వచి్చందని తెలిపారు. నగరంలో ఆకస్మికంగా పగటి పూట కూడా డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ రాములు, సెంట్రల్ జోన్ ఏసీపీ మోహన్ కుమార్, సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి పాల్గొన్నారు.