DRDO 2G Drug: వైరస్‌ రూపాంతరాలపైనా 2–డీజీ ప్రభావం!

DRDO Scientist Says 2G Drug Can Effective On Covid Different Variants - Sakshi

ఔషధాన్ని అభివృద్ధిపరిచిన శాస్త్రవేత్త అనంత్‌ నారాయణ్‌ స్పష్టీకరణ

2–డీజీ పనితీరు వినూత్నమని డీఆర్‌డీవో చైర్మన్‌  సతీశ్‌రెడ్డి కితాబు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2–డీఆక్సీ–డీ గ్లూకోజ్‌ (2–డీజీ) సమర్థంగా పనిచేస్తుందని డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌  అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అనంత్‌ నారాయణ్‌ భట్‌ తెలిపారు. ఫెడరేషన్‌  ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంగళవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ... కరోనా నిర్వహణలో 2–డీజీ కీలకం అవుతుందని ఆయన పేర్కొన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో 2–డీజి సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాతే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆ మందు అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసిందని చెప్పారు.

అదే విధంగా... మధ్యమ స్థాయి లక్షణాలున్న కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌  అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. మానవ ప్రయోగాల్లో ఇది 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రోగుల్లోనూ సమర్థంగా పని చేసిందని తెలిపారు. గతే డాది ఏప్రిల్‌లో తాము సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సాయంతో ఈ మందుపై పరిశోధనలు ప్రారంభించామని చెప్పారు.  

2–డీజీ పనితీరు వినూత్నం: సతీశ్‌రెడ్డి 
వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనా వైరస్‌ను 2–డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. 2–డీజీపై జరిగిన పరిశోధనలు అది సురక్షితమైందేనన్న విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. ఫెడరేషన్‌  అధ్యక్షుడు రమాకాంత్‌ ఇన్నాని, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉన్నతాధికారి దీపక్‌ సప్రా, హెల్త్‌కేర్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ శేఖర్‌ అగర్వాల్‌ వెబినార్‌లో పాల్గొన్నారు.  

చదవండి: బరువు తక్కువ.. పవరెక్కువ.. ప్రపంచాన్ని వణికిస్తోంది 3 కిలోల కరోనా! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top