
ఆరు కొత్త ప్లాంట్లలో యూరియా ఉత్పత్తి
2023–24 ఆర్థిక సంవత్సరంలో 314.07 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
త్వరలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సల్ఫర్ కోటెడ్ యూరియా
ఫెర్టిలైజర్ సిటీ (రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా మేకింగ్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త యూరియా యూనిట్లను స్థాపించింది. ప్రతీ యూనిట్ ఉత్ప త్తి సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్), ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్‌లోని హిందుస్థాన్ ఉర్వారక్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్), గోరక్‌పూర్‌లోని సింధ్రీ, గ్రీన్‌ఫీల్డ్ యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా 25 గ్యాస్ ఆధారిత యూ రియా యూనిట్లను స్థాపించారు. దీంతో 2014 –15 ఆర్థిక సంవత్సరంలో 225 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. 2023–24లో రికార్డుస్థాయిలో 314.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి పెంచడానికి ఇవి దోహదపడ్డాయి. ఏటా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుండడంతో.. దిగుబడి పెంచేందుకు యూ రియా వినియోగం అధికమైంది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలలో యూరియా కొరత ఏర్పడుతోంది.
అందుబాటులోకి
దేశీయ యూరియా..
2023–24 ఆర్థిక సర్వే ప్రకారం భారత వ్యవసాయ రంగం.. జనాభాలో దాదాపు 42.3 శాతం మందికి ఉపాధినిస్తోంది. గతంలో వ్యవసాయ రంగానికి అవసరమయ్యే యూరియా తయారీ కోసం వివిధ రసాయనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. దిగుమతి సుంకాలు, రవాణాతో ధరలు అధికంగా ఉండడంతో రైతులపై ఆర్థిక భారం పడేది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విధానంతో సబ్సిడీ పథకాలతో దేశీయంగా యూరియా, డీఏపీ, సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు.
ప్రారంభానికి నోచుకోని సల్ఫర్ కోటెడ్ యూరియా..
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సల్ఫర్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం రూ.150 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.
అయితే, సల్ఫర్ కోటెడ్ యూరియాను ఉత్పత్తి చేసేందుకు మరోకొత్త ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంది. నేటివరకు పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ చూపి.. రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో త్వరితగతిన సల్ఫర్ కోటెడ్ యూరియా ఉత్పత్తి ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.