దుబ్బాక ఫలితంతో రాష్ట్ర నాయకత్వం నిస్తేజం

Discussion In Congress Leaders  Over Dubaka By Election Result - Sakshi

మహామహులు మకాం వేసినా ఓడిపోవడంపై అయోమయం

పార్టీ తీరు మారకపోతే భవిష్యత్తులో మరిన్ని నష్టాలు 

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌ నాయకత్వాన్ని గందరగోళంలో పడేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ కీలక నేతలంతా ఎన్నికల క్షేత్రంలో విస్తృతంగా పనిచేసినా ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పీసీసీ చీఫ్‌ మొదలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతల వరకు దుబ్బాకలో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, బీజేపీ గెలుపొందడంతో కాంగ్రెస్‌ నేతల్లో అయోమయం నెలకొంది. 

అంచనాలు తారుమారు
2018 ముందస్తు ఎన్నికల్లో దుబ్బాకలో తమకు 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని, ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయనే ధీమాతో టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్‌. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తోడు చెరుకు ముత్యంరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుకూలత మరికొన్ని ఓట్లు రాలుస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఓట్లను రాబట్టుకొనేందుకు పని విభజన చేసుకొని మరీ టీపీసీసీలోని మహామహులంతా దుబ్బాకలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితం రాలేదు.

‘మా పార్టీకి చెందిన దాదాపు 150 మంది ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలు, మండలాలవారీగా బాధ్యతలు తీసుకొని పనిచేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మాకే లాభిస్తుందని అంచనా వేశాం. కానీ మా వ్యూహం ఫలించలేదు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. ఉత్తమ్‌తోపాటు రేవంత్, భట్టి లాంటి నాయకులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన చోట్ల కూడా పార్టీకి లీడ్‌ రాలేదు. కేవలం పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలంలో ఒక రౌండ్‌లోనే లీడ్‌ వచ్చింది’అని పీసీసీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ జరిగినప్పుడు బీజేపీకి కనీస స్థాయిలో ఓట్లు రాలేదు. దుబ్బాకలో మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీ ల మధ్య జరిగిన పోటీలో మాకు గౌరవప్రదమైన స్థాయిలో 22 వేల ఓట్లు వచ్చాయి. మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కానీ, చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. దుబ్బాక ఫలితాన్ని ఎలా అంచనా వేయాలో అర్థం కావడం లేదు’అని మరో కాంగ్రెస్‌ నేత అభిప్రాయపడ్డారు. 

తదుపరి ఎన్నికల్లో ఏమవుతుందో..? 
దుబ్బాకలో మూడో స్థానానికి పడిపోవడం, త్వరలో జరిగే ఎన్నికల్లో ఏమవుతుందోననే ఆందోళన కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటే మళ్లీ అవే ఫలితాలు పునరావృతమవుతాయని, మరోసారి టీఆర్‌ఎస్‌–బీజేపీల మధ్యే పోటీ జరిగిందనే వాతావరణం ఏర్పడితే గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణిలో ఎన్నికలు జరుగుతాయని అనుమానిస్తున్నారు. ఆ ధోరణి అలాగే కొనసాగితే తాము పెట్టుకొనే మిషన్‌–2023 లక్ష్యానికి గండిపడినట్టేననే అభి ప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తవుతోంది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోతే పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరమని,అధిష్టానం తీరు మారి రాష్ట్ర పార్టీని గాడిన పెట్టకపోతే మున్ముందు మరిన్ని నష్టాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

చదవండి: దుబ్బాక ఫలితంపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top