
సింగరేణిలో వార్షిక లక్ష్యసాధనపై నీలినీడలు
రోజుకు 4 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తేనే సాధ్యం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టంగానే కనిపిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఇందులో 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 64.06 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 59.84 మిలియన్ టన్నులే(93 శాతం) ఉత్పత్తి నమోదైంది.
మిగిలిన నెలలో (మార్చి 3వ తేదీ వరకు అందిన గణాంకాల ప్రకారం) ఇంకా 12.16 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలి. అంటే సగటున రోజుకు సుమారు 4 లక్షల టన్నుల ఉత్పత్తి తప్పనిసరి. కానీ 11 ఏరియాల్లో రోజువారీ ఉత్పత్తి లక్ష్యమైన 2.80 లక్షల టన్నుల్లో 2.50 లక్షల టన్నులే నమోదవుతోంది.
భూగర్భ గనుల్లో వెనుకంజ
సింగరేణివ్యాప్తంగా 11 ఏరియాల్లో 18 ఓపెన్‌కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఓపెన్‌కాస్ట్ గనుల్లో 58.57 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 55.56 మిలియన్ టన్నులు(95 శాతం), భూగర్భ గనుల్లో 54.83 లక్షల టన్నులకు 42.73 లక్షల టన్నుల(78 శాతం) ఉత్పత్తి నమోదైంది.
వాస్తవంగా భూగర్భ గనుల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, ఓసీల కంటే తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించినా, 100 శాతం ఉత్పత్తి సాధ్యం కావడం లేదు. ఈ విషయంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యం తోడవుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓసీల్లో రోజుకు సుమారు 2.40 లక్షల టన్నులు సాధిస్తుంటే, భూగర్భగనుల్లో రోజుకు 16 వేల టన్నులే నమోదవుతోంది.
వంద శాతం ఐదు ఏరియాల్లోనే..
గడిచిన ఫిబ్రవరిలో సింగరేణివ్యాప్తంగా ఐదు ఏరియాల్లోనే 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైంది. బెల్లంపల్లి ఏరియా 114 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, శ్రీరాంపూర్ ఏరియాలో 112 శాతం, మణుగూరు ఏరియాలో 111 శాతం, ఆర్జీ–1 ఏరియాలో 110 శాతం, ఆర్జీ–3లో 103 శాతం ఉత్పత్తి సాధించారు. మిగిలిన వాటిల్లో ఆర్జీ–2 ఏరియా 99 శాతం, మందమర్రి ఏరియా 95, భూపాలపల్లి 86 శాతం, కొత్తగూడెం ఏరియా 80 శాతం, ఏఎల్‌పీ 67, ఇల్లెందు ఏరియా 51 శాతంతో సరిపెట్టుకున్నాయి.
11 మాసాల్లో రెండు ఏరియాల్లో..
ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన 11 నెలల్లో పరిశీలిస్తే 100 శాతం లక్ష్యాన్ని రెండు ఏరియాలే సాధించాయి. ఇల్లెందు ఏరియా(కొత్తగూడెం రీజియన్) 110 శాతం, ఆండ్రియాల ప్రాజెక్ట్ (రామగుండం రీజియన్) 111 శాతం ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక కొత్తగూడెం ఏరియా 96, మణుగురు ఏరియా 97, బెల్లంపల్లి ఏరియా 95, మందమర్రి 77, శ్రీరాంపూర్ 86, ఆర్జీ–1 ఏరియా 94, ఆర్జీ–2 ఏరియా 94, ఆర్జీ–3 ఏరియా 98, భూపాలపల్లి ఏరియా 74 శాతం సాధించి వెనుకంజలో ఉన్నాయి.

సమష్టిగా లక్ష్యసాధనకు కృషి
ప్రతీ ఉద్యోగి, అధికారి సమష్టిగా పనిచేసి వార్షిక లక్ష్యసాధనకు కృషి చేయాలి. అందరూ రోజుకు ఎనిమిది గంటలు కచి్చతంగా బాధ్యతగా పనిచేయాలి. మస్టర్ నమోదు చేయించుకొని బయటకు వెళ్లే వారిపై చర్యలు తీసుకోవడమేకాక ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో హాజరయ్యేలా అధికారులు పర్యవేక్షించాలి. సంస్థ అభివృద్ధికి పనిచేస్తున్నామా లేదా అని అంతా ఆత్మపరిశీలన చేసుకుంటే ఫలితం ఉంటుంది. – ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ