ఆలయాల అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే.. 

Development Of temples Is Credited To KCR Said Tanneeru Harish Rao - Sakshi

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు 

దుబ్బాకలో వేడుకగా వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన

శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో మహోత్సవం 

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆలయాల నిధులను ప్రభుత్వం ప్రజా అవసరాలకు వినియోగించేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బాలాజీ ఆలయంలో శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా దేవుళ్లకు పూజ చేసిన తర్వాతే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలకు సైతం దేవుళ్ల పేర్లను పెట్టారని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ పరంగా రూ.4.25 కోట్లు, వ్యక్తిగతంగా రూ.కోటి అందజేశారని మంత్రి తెలిపారు.  

పచ్చటి తెలంగాణ కేసీఆర్‌ చలువే...: రాష్ట్రంలో గతంలో బీడు భూములు ఉండేవని.. ఇప్పుడు పచ్చటి పంట పొలాలతో, జలాశయాలతో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే అని చినజీయర్‌ స్వామి అన్నారు. శంషాబాద్‌లో రామానుజ ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరుగుతుందన్నారు. 1,035 కుండలతో లక్ష్మీనారాయణ యాగం చేస్తున్నామన్నారు. ఈ యాగానికి 2 లక్షల కిలోల నెయ్యిని వినియోగించి కరోనా లాంటివి కొంతలోకొంతైనా ప్రజల దరిచేరకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top